శ్రావణమాసం అంటే ప్రకృతి పరిమళించే పుణ్యకాలం. మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు ఒక పర్వదినమే, శ్రావణ సోమవారాలు పరమేశ్వరుని ఆరాధనకు, మంగళవారాలు మంగళగౌరీ వ్రతానికి, శుక్రవారాలు మహాలక్ష్మికి, శనివారాలు శ్రీ వెంకటేశ్వరుని సేవకు. ఇలాంటి పవిత్ర మాసంలో శ్రావణ శుక్రవారం జరిగే వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యానికి, శాంతికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ వ్రతాన్ని విశేషంగా పాటించడానికి ఒక పవిత్ర కథ ఆధారంగా చెబుతారు – అదే చారుమతీ కథ. పూర్వకాలంలో చారుమతీ అనే సతీధర్మ పరాయణ మహిళ, తన భర్త కోరిక మేరకు నిత్య పూజా కర్మలు చేస్తూ దైవభక్తిలో నిమగ్నమై ఉండేది. ఆమె భక్తి చూసి, స్వయంగా వరలక్ష్మీదేవి ఆమెకు దర్శనమిచ్చి – “నీవు పూజించు వరలక్ష్మీ వ్రతాన్ని స్త్రీలు అందరూ ఆచరిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుందని” అనుగ్రహించింది.
ఈ కథ ఆధారంగా ప్రతి ఏడాది శ్రావణ మాసపు శుక్రవారం పసుపు, కుంకుమ, మంగళసూత్రంతో అమ్మవారిని అలంకరించి, కలశం ప్రతిష్ఠించి, అష్టలక్ష్ములను పూజిస్తారు. అమ్మవారిని స్తుతిస్తూ నైవేద్యాలు, కర్పూరహారతులు సమర్పిస్తారు. స్త్రీలు ముత్యాల తాళిబొట్టు ధరించి, గాజులతో, శోభాయమానంగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఈసారి శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు ఉండడం అరుదైన యోగం. రెండో శుక్రవారం జరగే వరలక్ష్మీ వ్రతం అత్యంత శుభదాయకమైనది. ఈ రోజున అమ్మవారి కృపతో కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం విరాజిల్లతాయని నమ్మకం. భక్తితో, శ్రద్ధతో చారుమతిలా వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే – ఆమె వరాల వర్షం మన జీవనాన్ని కాంతిమంతం చేస్తుంది.
– సుకన్యారెడ్డి