చలనచిత్రాణి సంస్కృతేన- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

  • దైనందిన సంభాషణే సంస్కృతమ్
  • విద్యార్థులకు సరళంగా బోధించాలని సూచన
  • రోజువారీ సంభాషణలో ఈ భాష ఉండాలి
  • ఆన్‌లైన్ కోర్సులతో అందుబాటులోకి తేవాలి
  • దాని శబ్దం వ్యాకరణం ఇతర భాషలకు ఊతం

సహనం వందే, ఢిల్లీ:
యువత సంస్కృతం వైపు ఆకర్షితులవ్వాలంటే దానిని ఆసక్తికరంగా, సరళంగా బోధించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతంలో సినిమాలు (చలనచిత్రాణి సంస్కృతేన) రావాలన్నారు.‌సామాజిక మాధ్యమాలు, ఆధునిక కథనాల ద్వారా సంస్కృతాన్ని యువతకు చేరువ చేయాలని ఆయన అన్నారు. ఈ భాష ద్వారా భారతీయ సంస్కృతి, జ్ఞానం, విలువలను భవిష్యత్తు తరాలకు అందించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. మోహన్ భాగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు సంస్కృత భాష పట్ల ప్రజల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. సంస్కృతాన్ని సామాన్య ప్రజల సంభాషణ భాషగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

సంస్కృతం… అన్ని భాషలకు మాతృక
మోహన్ భగవత్ మాట్లాడుతూ… భారతీయ సంస్కృతికి, భాషలకు సంస్కృతం పునాది వంటిదని అన్నారు. దేశంలోని అనేక ప్రాంతీయ భాషలు సంస్కృతం నుంచే ఉద్భవించాయని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతంలోని శబ్ద వైవిధ్యం, వ్యాకరణ నియమాలు ఇతర భాషల పుట్టుకకు దోహదపడ్డాయని ఆయన చెప్పారు. ఈ భాష కేవలం పండితులకు, పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు.

రోజువారీ సంభాషణలో సంస్కృతం…
సంస్కృతాన్ని రోజువారీ సంభాషణ (దైనందిన సంభాషణే సంస్కృతమ్) లో భాగం చేసుకోవడం ద్వారా భారతీయ సంస్కృతిని మరింత బలోపేతం చేయవచ్చని భగవత్ అభిప్రాయపడ్డారు. ఈ భాషను నేర్చుకోవడం, మాట్లాడటం చాలా సులభమని, దీనివల్ల యువతలో సాంస్కృతిక చైతన్యం పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో సంస్కృత బోధనను ప్రోత్సహించాలని, దానిని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలని ఆయన సూచించారు.

ఆధునికతతో సంస్కృతం అనుసంధానం…
సంస్కృతం ఒక పురాతన భాష మాత్రమే కాదని, ఆధునిక సమాజంలోనూ ఎంతో ఉపయోగపడుతుందని మోహన్ భాగవత్ అన్నారు. సాంకేతికత, విజ్ఞాన శాస్త్రం, గణితం వంటి రంగాలలో సంస్కృత గ్రంథాలు అపారమైన సమాచారాన్ని అందిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. సంస్కృతాన్ని డిజిటల్ వేదికల ద్వారా, మొబైల్ యాప్‌ల ద్వారా, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *