‘సృష్టి’కి సాయం… అమ్మకు ద్రోహం -ఫెర్టిలిటీ సెంటర్లకు వైద్యాధికారుల వత్తాసు

  • పలు కేంద్రాల నుంచి పెద్దఎత్తున ముడుపులు
  • చూసీచూడనట్లు వదిలేయడంపై విమర్శలు
  • లక్షలు దండుకున్న కొందరు అధికారులు
  • ఇప్పటికీ కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లకు అండదండ

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాదులో అనేక ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు అక్రమ పద్ధతిలో శిశువులను అంటగట్టుతున్నారు. నగరంలో దాదాపు 180 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా… కొన్ని సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు వైద్యాధికారుల చేయూతతోనే ఈ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకుగాను కొందరు వైద్యాధికారులకు లక్షల రూపాయల ముడుపులు ముట్టచెబుతున్నట్లు ఒక సెంటర్ యజమాని వ్యాఖ్యానించారు.

‘సృష్టి’కి సాయం…
హైదరాబాద్ యూనివర్సల్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు అధికారులు కొందరు అండదండలు ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఆమెపై గతంలోనే అనేక ఫిర్యాదులు అందాయి… కేసులు నమోదు జరిగాయి. అయినప్పటికీ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కు అన్ని విధాలుగా అనుమతులు ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆమె చేస్తున్న అక్రమాల్లో కొందరు అధికారులకు వాటా ఉందన్న ప్రచారం జరుగుతుంది.

సంతానం లేని దంపతులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న నమ్రతకు అండగా ఉండడం గమనార్హం. గతంలో ఒక కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్ బీలోని టెస్ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది.

రోజుకో మలుపు…
సృష్టి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రత దందాలో ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ మోసాలపై ఐదేళ్ల క్రితమే కేసులు నమోదయ్యాయి. అప్పట్లో సోదాలు చేసిన వైద్యాధికారులు, పోలీసులు ఈ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. ఆమె లైసెన్స్‌ను రద్దుచేశారు. అప్పటికే ఆమె ఏపీలో, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బ్రాంచీల నుంచి సరోగసీ, టెస్ట్‌ట్యూబ్‌ బేబీ దందాను కొనసాగించినట్లు గుర్తించారు.

సికింద్రాబాద్‌లో కేంద్రం మూతబడిన తర్వాత కొద్ది విరామం ఇచ్చిన నమ్రత మరో డాక్టర్‌ పేరుతో లైసెన్స్‌ పొందింది. అప్పటి నుంచి తన ఇంటినే కేంద్రంగా మార్చేసి.. ఇద్దరిని సహాయకులుగా నియమించుకుంది. వారి ఆధ్వర్యంలో ఈ అక్రమ దందాను నమ్రత తిరిగి కొనసాగించినట్లు గుర్తించారు. ఇతరుల పేరుతో దందా కొనసాగిస్తున్నప్పుడు వైద్యాధికారులు ఆమెను ఎందుకు పట్టుకోలేకపోయారు? అంతేకాదు ఆమె అనేక ప్రకటనలు కూడా ఇచ్చారు. కొన్ని టీవీలలో ఫెర్టిలిటీ అంశంపై షోలు ఇచ్చారు. ఇంత జరుగుతున్నా తమకు సంబంధం లేదని వైద్యాధికారులు కొందరు వ్యాఖ్యానించడం పలాయన వాదమే అవుతుంది. తమకు బాధ్యతే లేదన్నట్టు మాట్లాడటం పట్ల అనేకమంది వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *