నర్మెట్టతో నట్టేట్లోకి ఆయిల్ ఫెడ్ – ఫ్యాక్టరీ ప్రారంభానికి ఆపసోపాలు

  • ఫ్రూట్ కోసం అధికారుల నానాపాట్లు
  • వివిధ ప్రాంతాల నుంచి తెచ్చేందుకు ఏర్పాట్లు
  • నేటి నుంచి ట్రయల్ రన్ చేయాలని నిర్ణయం
  • ఏమవుతుందో ఏమోనన్న టెన్షన్ టెన్షన్
  • అంతర్గత లోపాలు బయటపడకుండా సీక్రెట్
  • ఏం జరిగినా చూసుకుంటామని భరోసా
  • అక్రమార్కుల చేతుల్లోకి కోట్ల రూపాయలు

సహనం వందే, సిద్దిపేట:
ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల పాపాలకు నిదర్శనం నర్మెట్ట ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ద్వారా కొందరు అధికారులు ఆ సంస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరానికి మించి అధిక సామర్థ్యంతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల వందల కోట్ల ప్రజాధనం లూటీ అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫ్యాక్టరీని ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించడంతో శుక్రవారం నుంచి ట్రయల్ రన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అధికారులకు మాత్రం ఒక టెన్షన్ పట్టుకుంది. ఫ్యాక్టరీని ప్రారంభించాక దాన్ని పూర్తిస్థాయిలో నడిపించడం ఎలాగన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

నర్మెట్ట వెనుక కుట్ర…
నర్మెట్ట ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. ఫ్యాక్టరీని నిర్మించేందుకు రూ. 247 కోట్లు అవసరమని నిర్ధారించి బోర్డు ఆమోదం తీసుకున్నారు. 30 మెట్రిక్ టన్నుల నుంచి 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీ అవసరమని తేల్చారు. ఆయిల్ ఫెడ్ వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, ప్రైవేట్ కంపెనీలు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాయి. 13 ప్రైవేట్ పామాయిల్ ప్రాసెసింగ్ కంపెనీలకు జోన్లు కేటాయించారు. వారి తోటల్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా ఏ కంపెనీ ఫ్యాక్టరీలను నిర్మించడం లేదు. ఇన్ని వైరుధ్యాలు… అనేక వివాదాల నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. ఇంత సామర్థ్యంతో అక్కడ ఫ్యాక్టరీ అవసరం లేదని అనేకమంది రైతు నిపుణులు చెప్పినప్పటికీ… కోట్ల రూపాయల లూటీ కోసం ఇదంతా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. త్రిబుల్ ‘ఎస్’లు ఈ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఫ్యాక్టరీ నడిపేందుకు ఆపసోపాలు…
గత సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప మిగతా అన్ని తెలంగాణ జిల్లాల్లో పండిన ఆయిల్ పామ్ గెలలు 1600 టన్నులు. ఈ సంవత్సరం ఒక 15,000 టన్నులు రావచ్చు. అంటే ఆ ఫ్రూట్ తో సిద్దిపేట ఫ్యాక్టరీ ఒక వారం మాత్రమే నడిపించే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత అది ఏమవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సిద్దిపేట ఫ్యాక్టరీ ప్రస్తుత కెపాసిటీ 30 టీపీహెచ్. దీన్ని భవిష్యత్ లో 120 టీపీహెచ్ కు పెంచాలనే ఉద్దేశంతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టీపీహెచ్ అంటే ఫ్యాక్టరీ ఒక గంటకు ఒక టన్ను ఆయిల్ పామ్ గెలలు క్రష్ చేసే సామర్థ్యం. అంటే 30 టీపీహెచ్ × 24 గంటలు… అంటే ఒక రోజుకు 720 టన్నులు ప్రాసెస్ చెయ్యగలదు. దీని అంతరాయాలు పోను రోజుకి 20 గంటలకు లెక్కించినా 600 టన్నులు ప్రాసెస్ చేస్తుంది. ఇంత తక్కువ ప్రాసెసింగ్ కు అంత ఫ్యాక్టరీ అవసరమా అని రైతు నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దాన్ని నడపడానికి అవసరమైన ఫ్రూట్ ని ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై ఆపసోపాలు పడుతున్నారు.‌

అంతా సీక్రెట్…
ఈ ఫ్యాక్టరీని త్వరలో ప్రారంభించారని నిర్ణయించారు. అందులో జరుగుతున్న పనులను… వాడుతున్న మెటీరియల్ ను అధికారులు అత్యంత సీక్రెట్ గా ఉంచడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లాగా నర్మెట్ట ఫ్యాక్టరీ ప్రాంతాన్ని భద్రత వలయంలోకి తీసుకెళ్లారు. అందులో జరుగుతున్న పనులు… నాణ్యత విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘ఫ్యాక్టరీ ప్రారంభం అయ్యేవరకు ఎవరినీ లోనికి అనుమతించడం లేద’ని మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *