‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

  • అయితే తనిఖీలకు వచ్చే వాళ్ళు ఎవరు?
  • హెల్త్ యూనివర్సిటీ బృందం అంటూ మెసేజ్
  • కానీ ఎన్ఎంసీ తనిఖీలేనంటున్న డాక్టర్లు
  • గత నెల మెసేజ్ బయటకు రావడంతో కేర్
  • యధావిధిగా నకిలీ రోగులను రప్పిస్తున్నారు

సహనం వందే, హైదరాబాద్:
మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత నెల ఎన్ఎంసీ బృందం వస్తున్నట్లు ఇలాగే మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ లీక్ కావడం… ఆ వ్యవహారాన్ని ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు బట్ట బయలు చేయడంతో కాలేజీ యాజమాన్యం కంగుతిన్నది. ఆ రెండు పేపర్లలో రావడంతో అప్పుడు జరగాల్సిన ఎన్ఎంసీ తనిఖీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఎన్ఎంసీ తనిఖీలపై సందిగ్ధత కొనసాగింది. నెలరోజులైనప్పటికీ తనిఖీలు జరగలేదు. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ తనిఖీలు అంటూ పెట్టిన మెసేజ్ ఎంతవరకు వాస్తవం అన్న చర్చ జరుగుతుంది. ఎన్ఎంసీ బదులు యూనివర్సిటీ తనిఖీలు అంటూ డైవర్షన్ చేస్తున్నారా అన్న విమర్శలు ఉన్నాయి. ఎలా చేసినప్పటికీ తనిఖీల విషయం ముందే తెలియడం వెనుక యాజమాన్యాల లాబీ స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఎంఎంసీ గాని… ఇటు యూనివర్సిటీ గాని ఎవరు తనిఖీలు చేసినప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వడం మాత్రం సంబంధిత సంస్థలకే మచ్చ తెస్తుందని అంటున్నారు.

తీరు మారని వైద్య బృందాల వ్యవహారం…
దేశంలో ఎన్ఎంసీ తనిఖీలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతే కాదు కాలేజీలకు ముందస్తు సమాచారం ఇచ్చి అందుకు లక్షల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నట్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సంఘటనలు తెలిసిందే. అందుకు సంబంధించి దేశంలో అనేక కాలేజీలు, సంబంధిత తనిఖీ బృందాల డాక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి మనం చూశాం. తెలంగాణలో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం బ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తనిఖీ అధికారుల తీరు మారడం లేదు. అరెస్టు చేసినా… జైల్లో పడేసినా డబ్బు ముందు వారు లొంగిపోతున్నట్లు అర్థం అవుతుంది. తనిఖీల సమాచారం ఇప్పటికీ కాలేజీలకు అందుతుందంటే… బృందాలలోని అధికారులకు ఏమాత్రం భయం లేనట్టు తెలిసిపోతుంది.

దీన్ని కాలేజీ అంటారా?
మహావీర్ మెడికల్ కాలేజీని ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్ల ప్రతినిధులు గత సోమవారం సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలతో వీడియోలతో న్యూస్ ఆర్టికల్స్ ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. కాలేజీ అంటే ఇలా కూడా ఉంటుందా? ఇలాంటి డబ్బా కాలేజీలకు కూడా డబ్బులు పెడితే అనుమతులు వస్తాయా? అన్న అనుమానాలు వచ్చాయి. వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందించాల్సిన ఈ మెడికల్ కాలేజీ… కనీస వసతులు లేకుండా ఉంది. నిబంధనల మేరకు ఉండాల్సిన రోగుల ఆక్యుపెన్సీ ఏమాత్రం లేదు. ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులతో హడావుడిగా ఉండాల్సిన బోధనాసుపత్రి… ఒక పాడుపడిన భవనంలా దర్శనం ఇస్తుందంటే ఏమనాలి? అత్యంత బిజీగా ఉండాల్సిన కొన్ని వార్డులు ఖాళీ మంచాలతో దర్శనం ఇస్తున్నాయి.

తనిఖీల కోసం నకిలీ రోగులు…
తనిఖీలు ఉంటాయన్న సమాచారంతో గత కొన్ని రోజులుగా యాజమాన్యం నకిలీ రోగులను రప్పిస్తుంది. ఉదయం తీసుకొచ్చి టిఫిన్ పెట్టి డబ్బులు ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నట్టు ఉద్యోగులే చెప్తున్నారు. ఒక్కొక్కరికి డిమాండ్ ను బట్టి 500 రూపాయల వరకు ఇస్తున్నారు. ఇలాంటి కాలేజీకి తనిఖీ బృందాలు వచ్చి అనుమతులు ఇస్తే వారిని అనుమానించాల్సి ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *