- ‘సృష్టి’ సంఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన
- శిశువిక్రయాలకు తెగబడుతున్న వైద్యులు
- డాక్టర్ నమ్రత వెనుక అనేకమంది హస్తం
సహనం వందే, హైదరాబాద్:
‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు అసలు రక్షణ ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఎత్తుకొచ్చిన శిశువును కొనుగోలు చేసి… సరోగసి ద్వారా పుట్టించామని ఆ బిడ్డను తల్లిదండ్రులకు విక్రయించిన డాక్టర్ నమ్రత వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో శిశువులను ఎత్తుకుచ్చే గ్యాంగ్ తో ఫెర్టిలిటీ సెంటర్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. చిన్న పట్టణాలు… సీసీటీవీ లు కూడా లేని ప్రాంతాలు, అక్కడి ఆసుపత్రులే లక్ష్యంగా శిశువుల దొంగతనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. శిశువులను ఎత్తుకొచ్చే బ్యాచ్ కు… అందుకు సహకరించే వారికి లక్షల్లో ముట్ట చెబుతున్నారు.
కొందరు డాక్టర్లు కూడా ఇటువంటి వ్యవహారానికి సహకరిస్తున్నట్లు సమాచారం. నమ్రత ఒక డాక్టర్ కూడా. ఆమె శిశు అమ్మకాలకు పాల్పడిందంటే ఇంకెంత మంది వైద్యులు ఇందులో భాగస్వామ్యం అయ్యారోనన్న చర్చ జరుగుతుంది. ఆసుపత్రుల్లో ఎవరి పిల్లలను వాళ్లు కాపాడుకోవాల్సిందే. సాధారణ సిబ్బంది నుంచి డాక్టర్ల వరకు ఎవరినీ నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
నిద్రపోతున్న వైద్య యంత్రాంగం…
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం తప్ప నివారణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం జరుగుతుంది. మాటలు కోటలు దాటుతాయి కాని ఆచరణ మాత్రం గడప దాటని పరిస్థితి ఉంది. ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా… సీనియర్ వైద్యాధికారులు ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?

సృష్టి వంటి ఫెర్టిలిటీ సెంటర్లు హైదరాబాదు నడిబొడ్డున దారుణమైన శిశువిక్రయాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు? కొందరు వైద్యాధికారుల సహకారం లేకుండా ఇటువంటి సెంటర్లు నడపగలరా? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు అనుమతి రద్దు చేశామని చెప్తున్నారు… అలాగైతే అనుమతి లేకుండా అదెలా నడుస్తుంది? అంత పెద్ద సెంటర్ అక్రమంగా నడుస్తుంటే వైద్యాధికారులు నిద్రపోతున్నారా?
విచిత్రం ఏంటంటే ఈ ఘటన తమకు సంబంధం లేనట్టుగా హైదరాబాదుకు చెందిన కొందరు వైద్యాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. తాము చాలా సిన్సియర్ అని… అన్నా హజారే శిష్యులమని డబ్బాలు కొట్టుకుంటున్నారు. అంత గొప్ప వాళ్ళైతే హైదరాబాదులో ఇష్టారాజ్యంగా ఇటువంటి సెంటర్లు ఎలా నడుస్తున్నాయో చెప్పాలి. వాళ్ల సిన్సియారిటీ ఇటువంటి సెంటర్లపై ఉక్కు పాదం మోపేలా ఉండాలి. అంతేగాని సంఘటనలు జరిగినప్పుడు తమకు సంబంధం లేదని చేతులెత్తేయడం కొందరు వైద్యాధికారులకు పరిపాటి అయింది.