- సమగ్ర నివేదిక ఇవ్వాలని దామోదర ఆదేశం
- అసలు హైదరాబాదులో ఏం జరుగుతుంది?
- అధికారులు ఏంచేస్తున్నారని మంత్రి సీరియస్
- సృష్టి వెనక ఉన్న యంత్రాంగంపై విచారణ
- ఇది సాధారణ కేసు కాదని స్పష్ఠీకరణ
- పిల్లలని ఎత్తుకొచ్చి అమ్మడం దారుణం
సహనం వందే, హైదరాబాద్:
‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వైద్యాధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ‘సహనం వందే’ ప్రతినిధితో మాట్లాడుతూ… సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.

అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్, సరోగసీతో పిల్లల్లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్న సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తప్పించుకుంటున్న వైద్యాధికారులు…
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 200 వరకు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. కొన్ని సెంటర్లు నిబంధనల మేరకు పనిచేస్తుండగా… అనేక సెంటర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు విచారణలో వెలుగుచూసింది. జిల్లా వైద్యాధికారుల చేతుల్లోనే పర్యవేక్షణ ఉంటుందని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా వైద్యాధికారులు వీటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. లైసెన్సు రద్దు చేసినప్పటికీ, అది అక్రమంగా పనిచేస్తున్నప్పుడు బాధ్యత ఎవరిదని ఆయన నిలదీశారు. కాగా… ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో సంబంధిత వైద్యాధికారులు తప్పించుకుంటున్నారు. తమకు ఏమాత్రం సంబంధం లేదని వాదిస్తున్నారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి, టీవీలలో స్లాట్ లు బుక్ చేసుకుంటూ ప్రచారం చేస్తూ దందా చేస్తున్నప్పుడు వైద్యాధికారులకు బాధ్యత లేదా? అనేక ఫెర్టిలిటీ సెంటర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ వాటికి ఆధారం లేదంటూ రివర్స్ మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా అవినీతికి ఆధారాలు ఉంటాయా? రసీదులు ఇచ్చి ముడుపులు పుచ్చుకుంటారా? కొందరు వైద్యాధికారుల వాదన చూస్తుంటే తప్పుచేసి… దాన్ని ఎత్తి చూపిన వాళ్ల మీద ఎదురు దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరి బండారం ఏంటో కొందరు వైద్యాధికారులే చెప్తున్నారు. హైదరాబాదులో ఇంత జరుగుతుంటే బాధ్యత ఎవరు వహించాలి? వైద్యాధికారులు కాకుండా విద్యాశాఖ వాళ్ళు తీసుకుంటారా?
‘సృష్టి’లో 200 మంది రిజిస్ట్రేషన్…
సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హాస్పిటల్‌లో 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన 200 ఫైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో దంపతులకు వివిధ పద్ధతుల్లో డాక్టర్ నమ్రత పిల్లలను ఇచ్చారు. పిల్లల్ని పొందిన దంపతుల వివరాలను గోపాలపురం పోలీసులు సేకరిస్తున్నారు. సృష్టి వ్యవహారం బయటికి రావడంతో దంపతులు ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశారు. ఈ విషయంలో తమకు తలనొప్పులు ఎందుకని వాళ్ళు భావిస్తున్నారు. కాగా కూకట్‌పల్లి, కొండాపూర్‌లోనూ సృష్టి బ్రాంచ్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.