ఢిల్లీతో రేవంత్ రె’ఢ్డీ’ – బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతోనే కొట్లాట

  • 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో బీసీ నినాదం
  • తరలిరావాలని క్యాబినెట్ పిలుపు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులను ఆమోదించాలని కోరనున్నారు. ఈ సందర్భంగా బీసీలంతా ఢిల్లీకి తరలిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు
మంగళవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో 25 అంశాలపై చర్చించారు. వీటిలో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. ఆగస్టు మొదటి వారంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి వెళ్లి ఆరో తేదీన ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
గతంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, మాజీ ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఫ్యూడలిస్ట్ పార్టీ 2018 చట్టం ప్రకారం 50 శాతం లోపల రిజర్వేషన్లు అని తెచ్చి దానిని తగ్గించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ నెల 7న ఆర్డినెన్స్ జారీ చేశామని, 14న గవర్నర్‌కు పంపించామని తెలిపారు. 2018 పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న 50 శాతం నిబంధనను ఎత్తివేస్తూ, ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తాము చట్టం చేశామని, దానిని ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని గవర్నర్‌ను విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. గవర్నర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.

బీజేపీపై ప్రశ్నల వర్షం
కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపజేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్.కృష్ణయ్య, లక్ష్మణ్, అరవింద్ వంటి ఐదుగురు బీసీ ఎంపీలు ఉన్నారని, రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపజేయాలని వారిని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ బీసీ నాయకత్వం ఈ అంశాన్ని ఖండించి బలహీన వర్గాలకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేశవరావు, తాను, వాకిటి శ్రీహరి, మహేష్ గౌడ్ సహా బలహీన వర్గాల శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కలిసి ఈ అంశంపై విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు.

‘తెలంగాణ ఉద్యమంలా పోరాడాలి’
తెలంగాణ ఉద్యమంలా స్ఫూర్తిదాయకంగా బలహీన వర్గాలకు అవకాశం వస్తుందని, 90 శాతం పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభలో నిజాయితీగా బిల్లులకు మద్దతు తెలిపారని, ఇప్పుడు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కడుపులో కత్తులు పెట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేబినెట్‌లో కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఢిల్లీకి తరలిరండి!
ఆగస్టు 5, 6, 7 మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అడుగుతున్నారని మంత్రి తెలిపారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు వంద మందికి పైగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలోని ప్రతి శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, మంత్రులు ఢిల్లీ వెళుతున్నారని చెప్పారు. తెలంగాణలోని బీసీ మేధావులు, నాయకులు, కుల సంఘాలు, తెలంగాణ ఉద్యమం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా పోరాడారో, ఈ కీలకమైన దశలో కూడా అలాగే పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ప్రస్తావన…
రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుల ఆమోదానికి సమయం మించిపోతుందని, కోర్టు ఎన్నికలు జరపాలని చెబుతుందని మంత్రి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తర్వాత 50 శాతం నిబంధన పోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాతం బీసీ, 15 శాతం ఎస్సీ, 10 శాతం ఎస్టీతో కలిపి 64 శాతం రిజర్వేషన్లు నడుస్తున్నాయని వివరించారు. నిబంధన ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *