- ఆ ఐవీఎఫ్ సెంటర్ నుంచి లక్షలు వసూలు
- హైదరాబాద్ ఒక కీలక వైద్యాధికారి బాగోతం
- అనేక కేసులు ఉన్నా ‘సృష్టి’ని కాపాడారు
- ఏళ్లుగా తిష్ట వేసి ఆసుపత్రుల్లో దోపిడి
- కరోనా నుంచి ఇప్పటివరకు అదే తంతు
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ యూనివర్సల్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు హైదరాబాదుకు చెందిన ఒక కీలక వైద్యాధికారి అండదండలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమెపై అనేక ఫిర్యాదులు రావడం… కేసులు నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కు అన్ని విధాలుగా ఆ అధికారి అనుమతులు ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆమె చేస్తున్న అక్రమాల్లో ఆయనకు కూడా వాటా ఉందన్న ప్రచారం జరుగుతుంది.
సంతానం లేని దంపతులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న నమ్రతకు ఆ వైద్యాధికారి అండగా ఉండడం గమనార్హం. గతంలో ఒక కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్ బీలోని టెస్ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది.
ఇంత జరుగుతున్నప్పటికీ ఆ అధికారి ఆమెకు అండగా నిలవడం వెనుక అక్రమార్జనే కారణమని అంటున్నారు. ఆ అధికారి ఐదారేళ్లుగా హైదరాబాదులోనే తిష్ట వేశారు. కరోనా సమయంలో ఆస్పత్రులను దోపిడీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. అప్పటి ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒక కీలక అధికారితో చేతులు కలిపి కోట్లు కొట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఈ హైదరాబాద్ వైద్యాధికారి ఆసుపత్రుల అక్రమాల్లో జొరబడి కోట్లు గడిస్తున్నట్టు ప్రచార జరుగుతుంది.
ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్…
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించడంలో సృష్టి అక్రమాలకు తెరలేపింది. ఏకంగా 30 లక్షల రూపాయలు తీసుకుని ఆ దంపతులను నిలువునా ముంచారు.
ఆదివారం మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై కేసు నమోదైందని చెప్పారు. రాజస్థాన్ కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని చెప్పారు. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారని పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలిందని చెప్పారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారని తెలిపారు. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. వైద్యాధికారుల సహకారంతోనే ఇటువంటి ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.