- నిషేధిత బీటీ విత్తనాల విక్రయం
- రాష్ట్రవ్యాప్తంగా దళారుల ఇష్టారాజ్యం
- సోయాబీన్ విత్తనాల బ్లాక్ మార్కెటింగ్
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరకు విక్రయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 2,400 మాత్రమే కాగా… కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ. 2,600 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
విత్తనాల కొరత సాకుతో…
విత్తనాలు విక్రయించే వ్యాపారులు నగదు రూపంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ, రసీదులో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే నమోదు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే విత్తనాల కొరత ఉందని సాకుగా చెబుతున్నారు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు నాలుగు ఎకరాల భూమిలో పత్తి, సోయాబీన్, మిరప పంటలు సాగు చేసేందుకు విత్తనాలు అడిగితే, వ్యాపారి నాలుగు పత్తి విత్తన ప్యాకెట్లకు (ఒక్కొక్కటి 475 గ్రాములు) రూ. 900 చొప్పున రూ. 3,600, ఒక సోయాబీన్ సీడ్ సంచికి (30 కిలోలు) రూ. 2,400, మిరప విత్తనాలకు రూ. 900 బిల్లు వేశాడు. అయితే నగదు రూపంలో మాత్రం రూ. 600 అదనంగా తీసుకున్నాడు. రసీదులో వేసిన ధరల కంటే ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారని రైతు నిలదీయగా, పత్తి విత్తనాలపై ఒక్క ప్యాకెట్‌కు రూ. 100 అదనంగా ఇవ్వాల్సిందేనని, లేకుంటే విత్తనాలు ఇవ్వబోమని వ్యాపారి చెప్పడంతో చేసేది లేక రైతు ఆ అధిక ధరలకే విత్తనాలను కొనుగోలు చేశాడు. సగటున ఒక్క ప్యాకెట్‌పై రూ. 100 చొప్పున పత్తి, సోయాబీన్ విత్తనాలపై వసూలు చేస్తున్న దళారులు కోట్లాది రూపాయలను రైతుల నుంచి దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిషేధిత బీటీ విత్తనాల దందా
పత్తి విత్తనాలకు సంబంధించి బ్రాండెడ్ హైబ్రీడ్ విత్తనాలైన బీటీ1, బీటీ2 రకాల కొరత ఉందని చెబుతూ, ఎంఆర్ పీ ధర రూ. 901 ఉన్నా అదనంగా రూ. 200 వరకు వసూలు చేస్తున్నారు. హైబ్రీడ్ విత్తనాల గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా, మరికొందరు వ్యాపారులు నిషేధించిన బీటీ3 పత్తి విత్తనాలను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. బీటీ2 కంటే బీటీ3 విత్తనాలు సాగు చేస్తే 30 శాతం అధిక దిగుబడి వస్తుందని, దోమపోటు అసలు రాదని చెప్పి రూ. 600కే ప్యాకెట్ విత్తనాలను విడిగా విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఖమ్మం తదితర జిల్లాల్లోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాల్లో నిషేధిత గడ్డి మందులు, చీడల నివారణ కోసం వాడే ఆయిల్ ప్యాకెట్లను సైతం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.