- రోగి భద్రతకు ఎన్ఎంసీ అత్యంత ప్రాధాన్యం
- హై-రిస్క్ సర్జరీలపై లైవ్ నిషేధం
- టీవీ లైవ్ షోలు పెడుతున్న దారుణ పరిస్థితి
సహనం వందే, న్యూఢిల్లీ:
ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ సర్జరీలు నిర్వహించే విధానంలో రోగుల భద్రత, నైతిక ప్రమాణాలను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లైవ్ సర్జరీ లకు తప్పనిసరిగా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. రోగుల భద్రతను ఫణంగా పెట్టి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సర్జరీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఎన్ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆసుపత్రులు, సర్జన్లు, వైద్య సంస్థలు అమలు చేయాలని ఆదేశించింది.
.

కేవలం వైద్య విద్య, శిక్షణ కోసమే…
లైవ్ సర్జరీలు నిర్వహించే ఆసుపత్రులు తప్పనిసరిగా అక్రిడిటేషన్ కలిగి ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఆపరేషన్ థియేటర్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ప్రీ-ఆపరేటివ్, అనస్థీషియా, పోస్ట్-ఆపరేటివ్ సంరక్షణ, ఐసీయూ, లాబొరేటరీ సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని నిబంధనలు పేర్కొన్నాయి. ఈ సౌకర్యాలు లేని ఆసుపత్రులు లైవ్ సర్జరీలు చేపట్టడానికి అనుమతించరు. రోగులకు అత్యవసర సంరక్షణ అందించే సామర్థ్యం ఆసుపత్రులకు ఉండాలని ఎన్ఎంసీ నొక్కి చెప్పింది. ఈ సర్జరీలు కేవలం వైద్య విద్య, శిక్షణ కోసం మాత్రమే ఉపయోగపడాలని ఎన్ఎంసీ నొక్కి చెప్పింది.
హై-రిస్క్ సర్జరీలపై నిషేధం…
ఎన్ఎంసి గైడ్‌లైన్స్ ప్రకారం… హై-రిస్క్ సర్జరీలు లేదా అసంపూర్తి ఇన్వెస్టిగేషన్స్ ఉన్న రోగులను లైవ్ సర్జరీలకు ఎంపిక చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇటువంటి సర్జరీలు రోగి భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఎన్ఎంసీ హెచ్చరించింది. సర్జరీకి ముందు రోగి పూర్తి వైద్య చరిత్రను సమీక్షించి, అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే సర్జరీకి అనుమతించాలని సూచించింది.
రోగి సమ్మతి అవసరం…
లైవ్ సర్జరీలకు ముందు రోగి నుంచి స్పష్టమైన రాతపూర్వక సమ్మతిని తీసుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ సమ్మతి పత్రంలో సర్జరీకి సంబంధించిన రిస్క్‌లు, ప్రయోజనాలు, గోప్యత చర్యలను వివరంగా పేర్కొనాలి. రోగికి సర్జరీ గురించి పూర్తి సమాచారం అందించి, వారి అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ లైవ్ సర్జరీలు నిర్వహించకూడదని గైడ్‌లైన్స్ స్పష్టం చేశాయి. రోగి గోప్యతను కాపాడటం, వారి హక్కులను గౌరవించడం ఈ నిబంధనల లక్ష్యంగా ఉంది.
వాణిజ్య ప్రయోజనాలపై ఆంక్షలు…
కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు లైవ్ సర్జరీలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని, రోగుల భద్రతను పణంగా పెడుతున్నాయని సుప్రీం కోర్టులో రహీల్ చౌదరి తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్ఎంసీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఈ సమస్యను పరిష్కరించేందుకు కఠిన నిబంధనలు రూపొందించింది.
లైవ్ సర్జరీలు వాణిజ్య లాభాల కోసం లేదా ఆసుపత్రులు, సర్జన్లు, కంపెనీల ప్రచారం కోసం నిర్వహించకూడదని గైడ్‌లైన్స్ స్పష్టంగా పేర్కొన్నాయి. ఎన్ఎంసీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఈ సమస్యను పరిష్కరించేందుకు కఠిన నిబంధనలు రూపొందించింది. లైవ్ సర్జరీలు వాణిజ్య లాభాల కోసం లేదా ఆసుపత్రులు, సర్జన్లు, కంపెనీల ప్రచారం కోసం నిర్వహించకూడదని గైడ్‌లైన్స్ స్పష్టంగా పేర్కొన్నాయి.