అక్రమ సంబంధాల ‘కాంచీపురం’ – దేశంలోనే మొదటి స్థానం నిలిచిన పుణ్యక్షేత్రం

  • వివాహేతర సంబంధాల్లో దేశానికే రాజధాని
  • రెండో స్థానంలో సెంట్రల్ ఢిల్లీలోని ప్రాంతాలు
  • హైదరాబాద్ కు దక్కిన దిక్కుమాలిన ఘనత
  • గ్లోబల్ డేటింగ్ సైట్ ‘ఆష్లే మ్యాడిసన్’ నివేదిక

సహనం వందే, హైదరాబాద్:
మారుతున్న జీవనశైలితోపాటు సంబంధాలు, అనుబంధాలు కూడా మారతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంబంధాల మోజులో పడి కట్టుకున్నవాళ్ళనే కడతేర్చిన ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయలో భర్తను చంపిన భార్య ఉదంతం… అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెళ్లికొడుకును కడతేర్చిన నవ వధువు ఉదంతాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలకు కాంచీపురం అడ్డాగా మారిందని ప్రముఖ డేటింగ్ యాప్ వెల్లడించిన వివరాలు మరింత కలకలం రేపుతున్నాయి.

కాంచీపురంలో అక్రమ సంబంధాలు అధికం…
కథలన్నీ కంచికి చేరతాయని అంటారు. కానీ ఇక్కడ వివాహేతర సంబంధాల కథ కూడా కంచికి చేరింది. దేశంలోనే వివాహేతర సంబంధాలకు ముఖ్య కేంద్రంగా తమిళనాడులోని కాంచీపురం నిలిచింది. ప్రముఖ గ్లోబల్ డేటింగ్ సైట్ ‘ఆష్లే మ్యాడిసన్’ https://www.ashleymadison.com/ వెల్లడించిన వివరాల ప్రకారం… ఈ జూన్ నాటికి ఈ చిన్న పట్టణం వివాహేతర సంబంధాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత సంవత్సరం 17వ స్థానంలో ఉన్న కాంచీపురం, ఒక్కసారిగా అగ్రస్థానానికి ఎగబాకడం ఆశ్చర్యకరం.

ఢిల్లీ నగరంలోనూ విస్తృత సంబంధాలు…
కాంచీపురం తర్వాత రెండో స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ఉంది. అంతేకాదు వివాహేతర సంబంధాల జాబితాలోని టాప్ ఇరవై నగరాల్లో ఏకంగా తొమ్మిది స్థానాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాలు దక్కించుకోవడం శోచనీయం. గురుగ్రామ్, గౌతమ్ బుద్ధనగర్, సౌత్ వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ దేశ రాజధానిగానే కాకుండా వివాహేతర సంబంధాల రాజధానిగానూ తన ప్రాబల్యాన్ని చాటుకుంటోంది.

హైదరాబాదుకూ చోటు…
ఢిల్లీ తర్వాత డెహ్రాడూన్, పూణే, బెంగళూరు, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, రాయ్‌గఢ్, హైదరాబాద్, ఘజియాబాద్, జైపూర్ వంటి ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు అధికంగా ఉన్నాయని ఆష్లే మ్యాడిసన్ నివేదిక పేర్కొంది. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై ఈ జాబితాలో టాప్ ఇరవైలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో రెండో స్థానంలో ఉన్న ముంబై… ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. టైర్-2, టైర్-3 నగరాల్లో వివాహేతర బంధాలు పెరుగుతున్నాయని ఈ సర్వే చెబుతోంది. దేశంలో 53 శాతం మంది వివాహితులు తమ భాగస్వాములను మోసం చేస్తున్నట్లు ఈ సర్వేలో అంగీకరించారు.

ఆష్లే మ్యాడిసన్ గురించి…
ఆష్లే మ్యాడిసన్ అనేది కెనడియన్-ఫ్రెంచ్ సామాజిక నెట్‌వర్కింగ్ డేటింగ్ సైట్. 2002లో ప్రారంభమైన ఈ సంస్థ, వివాహేతర సంబంధాలను కోరుకునే వివాహిత వ్యక్తులకు సేవలు అందిస్తుంది. ఈ సంస్థ వెల్లడించిన తాజా గణాంకాలు దేశంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెరగడానికి గల కారణాలను మాత్రం ఆష్లే మ్యాడిసన్ వెబ్‌సైట్ వెల్లడించలేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *