సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో, విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు న్యాయవ్యవస్థలో నూతన నాయకత్వానికి మార్గం సుగమం చేశాయి. వారి నాయకత్వంలో తెలంగాణ జడ్జీల సంఘం మరింత బలోపేతం అవుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర కీలక పదవులకు ఎన్నికైన వారు…
సంఘం ఇతర ఆఫీస్ బేరర్ల వివరాలను కూడా ప్రకటించారు. మహిళా ప్రతినిధిగా జె. మైత్రేయి ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా డి. దుర్గా ప్రసాద్, జి. వేణు, పి. లక్ష్మీ శారద, డాక్టర్ సిహెచ్ సంపత్, పి. శ్రీదేవి, ఎం. రాజులు ఎన్నికయ్యారు. అలాగే జె. ఉపేందర్ రావు, గౌస్ పాషా, కల్పన ఖుష్బూ, గోపి కృష్ణ, పూజ, హిమబిందు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. వీరందరితో కలిపి మొత్తం 12 మంది కార్యనిర్వాహక సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేయనున్నారు.