- జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ప్రకంపనలు
- ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణం
- జస్టిస్ వర్మ కేసుతో రాజకీయ సంచలనం
సహనం వందే, న్యూఢిల్లీ:
ఎవరి మాటా వినని… తన మాటే శాసనం అన్న తీరుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ శకానికి తెరపడుతోందా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణమని స్పష్టమవుతోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వివాదం పతాక స్థాయికి చేరడం, మోడీ అవిశ్వాస హెచ్చరికలకు ధన్‌ఖడ్ రాజీనామాతోనే బదులివ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మోడీ నాయకత్వానికి ధన్‌ఖడ్ ఉదంతం బ్లడ్ ఆన్ కార్పెట్ వంటిదని సీనియర్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
జస్టిస్ వర్మ కేసుతో భగ్గుమన్న విభేదాలు…
ప్రధాని మోడీతో పొసగకపోవడం వల్లే ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల కేసు, ఆయనపై అభిశంసనకు సంబంధించిన చర్యలే ఈ విభేదాలకు కారణమని తెలుస్తోంది. అధికార బీజేపీ జస్టిస్ వర్మ అభిశంసన వ్యవహారం లోక్‌సభలోనే జరగాలని భావించింది. అయితే రాజ్యసభలో విపక్షాలు ఇదే విషయాన్ని తొలుత లేవనెత్తడం, ప్రభుత్వ పెద్దలతో చర్చించకుండానే ఉపరాష్ట్రపతి హోదాలో ధన్‌ఖడ్ విపక్షాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ప్రధాని మోదీకి ఏ మాత్రం రుచించలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి మోదీ ఆదేశించారని, ఈ విషయం తెలియగానే… ధన్‌ఖడ్ ఎవరికీ లొంగబోనన్న సంకేతాలిస్తూ తక్షణమే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. ఇదే వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేతతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

లక్ష్మణరేఖ దాటిన ధన్‌ఖడ్?
ధన్‌ఖడ్‌పై మోడీకి విశ్వాసం సన్నగిల్లడం వల్లే రాజీనామా తెరమీదకు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అభిప్రాయపడ్డారు. తన మాట విన్నంత వరకే మోడీ ప్రభుత్వం సఖ్యతగా ఉంటుందని, అలా లేని నాడు సాగనంపడమే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలు, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ధన్‌ఖడ్ గతంలో బహిరంగంగా నిలదీశారు. న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడంతోపాటు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో విపక్షాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ధన్‌ఖడ్ లక్ష్మణ రేఖను దాటి ప్రవర్తించారని బీజేపీ భావించిందని, అందుకే ఆయనను సాగనంపేలా చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముందస్తు షెడ్యూల్ లేకుండానే రాజీనామా…
రాజీనామాకు ముందు ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే ధన్‌ఖడ్ రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను అందించారని సమాచారం. అరగంట తర్వాత రాజీనామా లేఖను ధన్‌ఖడ్ స్వయంగా తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. ఒక సీనియర్ రాజ్యాంగ నేత ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా రాష్ట్రపతి భవన్‌కు రావడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో రాజీనామాపై ధన్‌ఖడ్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొన్నారా? అనే చర్చ సాగుతోంది.