- ఆ మెడికల్ కాలేజీకి పూర్తి అండదండలు
- నెల క్రితం ప్లాన్ ఫ్లాప్… ఇప్పుడు పకడ్బందీ
- ఈ నెల 29వ తేదీ వరకు వచ్చేలా స్కెచ్
- ఆ ప్రకారం నకిలీ రోగులతో ‘మహా’కాంట్రాక్ట్
- ఉదయం 8కు రావడం 4 గంటలకు వెళ్లడం
- ఆ ప్రకారం బస్సుల్లో రోగుల తరలింపు ప్రక్రియ
సహనం వందే, హైదరాబాద్:
జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్ మెడికల్ కాలేజీ వ్యవహారం. నెల రోజుల క్రితం ఆ కాలేజీ తనిఖీకి వస్తామని ఎన్ఎంసీ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ విషయాన్ని ‘సహనం వందే https://sahanamvande.com/?p=5051 ఆర్టికల్ టుడే’ https://articletoday.in/ mahaveer-medical-college-fake-patients-ghost-faculty/ డిజిటల్ పేపర్లు బట్ట బయలు చేయడంతో అప్పట్లో జరగాల్సిన తనిఖీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నెల రోజులు గడిచినప్పటికీ ఎన్ఎంసీ అధికారులు ఆ కాలేజీకి రావడానికి వెనుకా ముందూ ఆడుతున్నారు. ఏదో ఒక సమయంలో వస్తామని… అప్పటివరకు నిత్యం రోగులను అందుబాటులో ఉంచుకోవాలని మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ఎన్ఎంసీ అధికారులు సూచించినట్లు తెలిసింది. గత నెల ప్లాను విఫలం కావడంతో ఇప్పుడు పకడ్బందీగా తనిఖీలు జరిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేలా కాంట్రాక్ట్…
ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రక్రియ మొదలైంది. మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం మరో 100 ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అంటే ఇప్పుడున్న 150 సీట్లకు అదనంగా మరో వంద సీట్లు… అంటే మొత్తం 250 సీట్లకు పెంచుకోవాలనేది యాజమాన్య లక్ష్యం. మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం అవుతున్నా… సీట్ల కోసం మాత్రం ఫీట్లు చేస్తున్నారు. మరోవైపు పీజీ కోర్సులకు సంబంధించిన తనిఖీలు కూడా పూర్తి కావాలి. ఈ రెండు అంశాలపై ఈ నెలాఖరులోగా తనిఖీలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారం ఈ నెల 29వ తేదీ నాటికి మహావీర్ మెడికల్ కాలేజీకి తనిఖీలకు వస్తామని ఎన్ఎంసీ బృందాలు యాజమాన్యానికి స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. కాబట్టి అప్పటివరకు నిత్యం రోగులు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రతిరోజు నకిలీ రోగులను రప్పిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి వందమందికి పైగా రోగులను ప్రత్యేక బస్సుల్లో తరలించేలా ఏర్పాట్లు చేశారు.

ఆ ప్రకారం నకిలీ రోగులు ఈ నెల 29వ తేదీ వరకు వచ్చేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు కాలేజీకి చెందిన ఒక అధికారి చెప్తున్నారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం నకిలీ రోగులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి. వారికి ఉదయం టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం సాధారణ భోజనం లేదా బిర్యానీ ఇస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికి రూ. 1000 నుంచి రూ. 2000 చొప్పున ఇస్తున్నట్టు తెలిసింది. వారిని రప్పించేందుకు ఆయా స్పెషాలిటీ విభాగాలకు చెందిన కొందరు క్లర్కులు పర్యవేక్షణ చేస్తున్నారు. వారి పేర్ల మీద నకిలీ కేస్ షీట్లు తయారుచేసి ఉంచారు. నకిలీ రోగులు కాబట్టి ఎవరికి ఏం జబ్బు వచ్చిందో కేస్ స్టడీలో వారి పేరు మీద ఉన్న జబ్బు ప్రకారం ఎన్ఎంసీ బృందం ముందు అలాగే మాట్లాడేలా శిక్షణ ఇస్తున్నారు.
ఫాదర్ కొలంబో కాలేజీపై వేటు…
మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ తనిఖీల ప్రక్రియలో అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దేశంలో అనేక మెడికల్ కాలేజీలలో అక్రమాలు బయటపడటంతో సీబీఐ కేసులు పెడుతోంది. ఎన్ఎంసీ లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. సీబీఐ దర్యాప్తులో ఎన్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు, దళారులు, వైద్య కళాశాలల నిర్వాహకులతో కలిసి కోట్ల రూపాయల లంచాలు మేసినట్లు తేలింది. ఏ మాత్రం వసతులు లేని కాలేజీలకు అనుమతులు కట్టబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో వరంగల్ జిల్లాకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీకి ముడుపులు ఇచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో తేలడంతో రద్దు చేశారు. అలాగే ఛత్తీస్ ఘడ్ లో తనిఖీ బృందంలో ఉన్న హైదరాబాద్ డాక్టర్ రజినీరెడ్డి పైన కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక మహావీర్ మెడికల్ కాలేజీ వ్యవహారంలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.