పాత వివాదాలు… కొత్త అనుమానాలు! చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సందేహాలు

  • గత ఒప్పందాలపై రాజకీయ విమర్శల వెల్లువ
  • రేపటి నుంచి ఆ దేశంలో పర్యటనకు రంగం

సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించాలనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనకు బయలుదేరుతుండగా, గతంలో ఈ దేశంతో జరిగిన వివాదాస్పద ఒప్పందాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు సహా ఎనిమిది మంది బృందం పాల్గొననుంది.

మళ్లీ అదే బాటలో పయనమా?
సింగపూర్‌లో ముఖ్యమంత్రి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానాలు, సులభతర వాణిజ్య విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, మెరుగైన కనెక్టివిటీ, సుదీర్ఘ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు వంటి అంశాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరతారని తెలుస్తోంది. పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారని సమాచారం. అయితే గతంలో ఇదే తరహా పర్యటనలతో, హామీలతో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలపై స్పష్టత కొరవడిన నేపథ్యంలో, ఇప్పుడు జరుగుతున్న పర్యటనపైనా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పాత గాయాలు, చేదు జ్ఞాపకాలు
గతంలో సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వివాదాస్పద ఒప్పందాలు, తదనంతర పరిణామాలు మళ్ళీ చర్చకు వస్తున్నాయి. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం సింగపూర్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించడంతో పాటు పలు రాజధాని ప్రాజెక్టుల విషయమై సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేటు కంపెనీలతో సమావేశమయ్యారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా డెవలెప్‌మెంట్‌ కోసం 2017 మే 2న అప్పటి టీడీపీ ప్రభుత్వం అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జ్‌–సెంబ్‌కార్ప్‌ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంది.

అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం వాటా మాత్రమే ఉండగా, కేవలం రూ. 306.4 కోట్లు మాత్రమే వెచ్చించే కన్సార్టియానికి 58 శాతం వాటా ఇవ్వడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఒప్పందంలో మార్పులు, కొత్త షరతులు విధించేందుకు అవకాశం లేకుండా పవర్‌ ఆఫ్‌ అటార్నీ రాసి ఇవ్వాలని కన్సార్టియం కోరగా, రాష్ట్ర ప్రభుత్వం అందుకు లొంగిపోయి జీవో నంబర్‌ 168ని విడుదల చేయడంపై విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే ఏడాది నవంబర్‌లో సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబు

అవినీతి మరకలు… జైలుపాలైన మిత్రుడు
2017లో అమరావతి ఒప్పందంపై సంతకం చేసిన అప్పటి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అవినీతి ఆరోపణలతో జైలుపాలవడం తాజా పర్యటన నేపథ్యంలో మళ్ళీ చర్చకు వస్తోంది. సింగపూర్‌ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్‌ రేసింగ్‌ కాంట్రాక్ట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో 2023 జూలైలో ఆయన అరెస్టు అయ్యారు. దర్యాప్తు అనంతరం ఈశ్వరన్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. ఈశ్వరన్‌ అరెస్టుతో, ఆయన నేతృత్వంలో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో అనుమానాలు, ప్రశ్నలు వెల్లువెత్తాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *