ఎన్ఎంసీ స్కాన్… మెడికల్ స్కామ్ – తనిఖీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల బండారం

  • ఒకే ప్రొఫెసర్ రెండు కాలేజీల్లో పనిచేస్తున్నారు
  • సీట్ల సంఖ్యకు అనుగుణంగా లేని ఫ్యాకల్టీ
  • కొన్ని కాలేజీల్లో సగం మందే బోధనా సిబ్బంది
  • విద్యార్థులకు వసతుల కల్పనలో నిర్లక్ష్యం
  • దీంతో వైద్య విద్యలో రాణించని విద్యార్థులు
  • కొన్ని ప్రైవేట్ వైద్య కాలేజీలపై వేటు తప్పదా?

సహనం వందే, హైదరాబాద్:
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతోంది. డబ్బుల కోసం కాలేజీలు పెట్టిన కొందరు బడా బాబులు నాసిరకం వైద్య విద్య అందిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఆయా కాలేజీలు కునారిల్లిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించక… బోధన సిబ్బంది పూర్తిస్థాయిలో లేక వైద్య విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లకు అందాయి.

ఎన్ఎంసీ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు…

  • పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.87%, మరో కాలేజీలో 56.8% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 67.21% ఉంది.
  • 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఒక కాలేజీలో కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు. (ఇందులో నకిలీ రోగులు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు)
  • ఒక మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. మరోచోట 450 మాత్రమే ఉన్నాయి.
  • రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.78%, 12.07% ఉంది.
  • పలుచోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. లైబ్రరీలు అందుబాటులో లేవు.
  • ఒకే ప్రొఫెసర్ ను రెండు కాలేజీల్లో చూపించారు. అనేకచోట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్లే కీలకంగా ఉంటున్నారు.
  • ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేవు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు, సిబ్బంది లేరు.

కాలేజీలో ఉండాల్సిన సదుపాయాలు ఇవీ…

  • 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండే మెడికల్ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. స్కిల్ లేబొరేటరీ ఉండాలి. సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్ టీ-పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి.
  • 100 ఎంబీబీఎస్ సీట్లున్న మెడికల్ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా కాలేజీలు వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది.
  • వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లే కీలకంగా ఉన్నారు. ఇక్కడ పీజీలకు తరగతులే జరగడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పైగా ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లాసులు తీసుకోమని పీజీలకు ఆదేశాలు ఇస్తున్నారు. ఆ ప్రకారం షెడ్యూలు కూడా ఖరారు చేసినట్టు ఒక ఫ్యాకల్టీ తెలిపారు.

తనిఖీల సమయంలో సర్దు’పాట్లు’
రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్ లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్ బయోమెట్రిక్ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

కొన్ని కాలేజీలపై వేటు తప్పదా?
మూడేళ్ల క్రితం మహావీర్ మెడికల్ కాలేజీలో పాటు మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. అయినా ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో అనేక కాలేజీలు వెనుకబడే ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొందరు ఎన్ఎంసీ అధికారులతో కుమ్మక్కై కాలేజీలకు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈసారి ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు లంచాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అనేకమందిపై సీబీఐ కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. తెలంగాణలో ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేసింది. త్వరలో మరికొన్ని కాలేజీల గుర్తింపు రద్దు అవుతుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ఎంసీ బృందాలు కొన్ని కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆ బృందాలను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తలమునకలై ఉన్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *