బీసీల నెత్తిన టోపీ – 42 శాతం రిజర్వేషన్లపై నీలినీడలు

  • కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు తక్కువ
  • కేవలం రాజకీయ అంశంగా మారే పరిస్థితి
  • అగ్రవర్ణాలు ఆడుతున్న నాటకమన్న విమర్శ
  • బీసీ ఓట్లను తమవైపు తిప్పుకునేలా కుట్ర
  • అంబేద్కరిజాన్ని పక్కన పెట్టిన బహుజనులు

సహనం వందే, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాలను రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు నాటకాలు ఆడుతూనే ఉన్నాయి. అగ్రవర్ణ పార్టీల నాయకులు బీసీల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తూనే ఉన్నాయి. అటువంటి వారిని కొందరు బీసీ నాయకులు నమ్ముతుండడం పరాకాష్ట. ఎక్కడైనా మేకలకు పులి రక్షణ ఇస్తుందా? అని బీసీ నేతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో… స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.‌ ఈ బిల్లులను కేంద్ర ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లులకు ఆమోదం తెలుపుతుందని ఎవరైనా నమ్మగలరా? ఇది కేవలం రాజకీయ నాటకం తప్ప మరోటి కాదని కొందరు బహుజన నేతలు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీలో సీఎం హడావుడి…
42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలపాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో హడావుడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఢిల్లీ వచ్చినట్టు’ ఆయన చెప్తున్నారు.

రాజకీయ విమర్శ…
‘బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు, అలాగే స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లుల‌ను ఆమోదించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం తాత్సారం చేస్తోంది. రాష్ట్ర హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, 30 రోజుల్లో రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కలిసి వివరించి వారి మద్దతు కోరుతాం. తద్వారా సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని’ పేర్కొన్నారు. బహుజన నేతలు అగ్రవర్ణ నాయకుల చేతిలో తమ జాతి భవితవ్యాన్ని ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. బడుగు బలహీనవర్గాలకు బహుజన నాయకత్వం కావాలి కానీ… వారికి అగ్రవర్ణ నాయకత్వం ఎలాంటి మేలు చేకూరుస్తుందనేది ప్రశ్నించుకోవాలి. అంబేద్కరిజాన్ని పక్కనపెట్టి కొందరు నేతలు అగ్రవర్ణ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *