ఇరాన్ ‘జలాయుధం’ – హోర్ముజ్ జలసంధిపై ఉక్కుపాదం

Iran water War starts
  • కొత్త సుప్రీం లీడర్ దూకుడు నిర్ణయం
  • తండ్రి చావుతో రగిలిపోతున్న ఖమైనీ కొడుకు
  • ప్రపంచ దేశాలకు ఇంధన రవాణా నిలుపుదల
  • ఆంక్షల గర్జన… రాయబారులపై నిబంధన
  • అంతర్జాతీయంగా చమురు సంక్షోభం
  • గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇక్కట్లు

సహనం వందే, ఇరాన్:

ప్రపంచ దేశాల గుండెలపై ఇరాన్ గన్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రపంచ చమురు సరఫరాను నిర్బంధించింది. ఇజ్రాయిల్, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా చమురు ఎగుమతులను ఆపేస్తామని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Iran starts Water War

వ్యూహాత్మక జలసంధిపై ఆంక్షలు
ప్రపంచ క్రూడ్ ఆయిల్ ఎగుమతులకు హోర్ముజ్ జలసంధి ప్రధాన మార్గం. ఇక్కడ ఇరాన్ ఆంక్షల గర్జన మొదలైంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ఆపకపోతే ఇంధన రవాణా నిలిచిపోతుంది. తమ భూభాగం నుండి అమెరికా, ఇజ్రాయిల్ రాయబారులను బహిష్కరిస్తేనే రవాణాకు అనుమతి ఇస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బుధవారం నుండే అమల్లోకి వస్తుందని టెహ్రాన్ టైమ్స్ ప్రకటించింది.

యుద్ధం ముగింపుపై భిన్నవాదన
యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పూర్తిగా కొట్టిపారేశాయి. యుద్ధం ఎప్పుడు ముగియాలో తామే నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. యుద్ధ సమీకరణాలు పూర్తిగా తమ సైనిక దళాల చేతుల్లోనే ఉన్నాయని వారు వాదించారు. అమెరికా దళాలు యుద్ధాన్ని ఆపలేవని ఇరాన్ సవాలు విసిరింది.

చమురు ఎగుమతులపై కఠిన హెచ్చరిక
సైనిక దాడులు కొనసాగితే ఒక్క చుక్క చమురు కూడా బయటకు పోనివ్వమని ఇరాన్ స్పష్టం చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం… ఈ హెచ్చరికను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటికే యుద్ధం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో దూకుడు
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి మద్దతు పెరుగుతోంది. ఇరాన్ సైనిక దళాలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. ప్రాంతీయ రాజకీయాల్లో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఇరాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితి పశ్చిమాసియాలో అస్థిరతను మరింతగా పెంచుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం
ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ఇక్కడ ఆంక్షలు వస్తే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ట్రంప్ తన వ్యాఖ్యలతో మార్కెట్లను శాంతపరచాలని చూస్తున్నా… ఇరాన్ హెచ్చరికలు పరిస్థితులను క్లిష్టంగా మారుస్తున్నాయి. డాలర్లతో పోలిస్తే చమురు మార్కెట్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ అనిశ్చితి ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి…
యుద్ధం ముగింపు ఇప్పుడు పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉందని అక్కడి గార్డ్స్ చెబుతున్నారు. ప్రపంచ చమురు సరఫరాను ఆపేస్తామన్న హెచ్చరికలు ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ముప్పుగా మారాయి. యుద్ధం ఆగే సూచనలు కనిపిస్తున్న సమయంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ దూకుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *