మహావీర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ లీకులు

  • వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో నేడు, రేపు ఎంఎంసీ తనిఖీలు
  • యాజమాన్యానికి ముందే సమాచారం… అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న వైనం
  • లారీలలో నకిలీ పేషంట్లను తెప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
  • కాగితాలపై ఉన్న హెచ్వోడీలను రప్పించేందుకు సన్నాహాలు
  • ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు

వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండు రోజుల ప్రత్యేక డ్రామాకు తెరలేపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందాల తనిఖీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని మేనేజ్మెంట్ కు సమాచారం అందింది. ఆకస్మికంగా జరగాల్సిన తనిఖీలు ముందస్తు లీకు కావడం గమనార్హం. దీంతో యాజమాన్యం మహా యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వివిధ విభాగాల అధిపతులు తక్షణమే కాలేజీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కేవలం కాగితాల్లో మాత్రమే హెచ్వోడీలుగా ఉన్నారు. ఈ రెండు రోజులు తనిఖీలు జరుగుతాయని కాలేజీ యంత్రాంగం వారికి వాట్సాప్ గ్రూపు ద్వారా సమాచారం పంపారు.

రోగుల తరలింపునకు ప్రత్యేక లారీలు…

ఈ మెడికల్ కాలేజీలో నిబంధనల ప్రకారం ఔట్ పేషెంట్లు ఉండడం లేదు. అలాగే హెచ్ఓడీలు, పూర్తిస్థాయి ఫ్యాకల్టీ కూడా ఏర్పాటు చేయలేదని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు జరుగుతాయని ముందే సమాచారం రావడంతో యాజమాన్యం ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసింది. ఔట్ పేషెంట్లను తెప్పించేందుకు నకిలీ రోగులను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. వారిని తరలించేందుకు లారీలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా నకిలీ రోగులు… అప్పటికప్పుడు తరలివచ్చే హెచ్వోడీలు… ఫ్యాకల్టీ… ఇతర ప్రాంతాల నుంచి కొన్ని రకాల పరికరాలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

ఎన్ఎంసీ అధికారుల కుమ్మక్కు?
మహావీర్ మేనేజ్మెంట్ కు తనిఖీల వ్యవహారం ముందే తెలిసిందంటే ఎన్ఎంసీ అధికారులు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని విమర్శలు వస్తున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వడం ఏ మేరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యం తీరు పట్ల అక్కడ చదువుతున్న యుజీ, పీజీ విద్యార్థులు ముక్కున వేలేసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం తనిఖీల సందర్భంగా అనేక లోపాలు గుర్తించడంతో ఆ కాలేజీకి ఆ ఏడాది అనుమతి రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయినా యాజమాన్యం తన తీరును మార్చుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంఎంసీ అధికారులు ఆ కాలేజీ వ్యవహారం తెలిసి కూడా ముందస్తు సమాచారం ఇవ్వడంలో మతలబు ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *