- చంద్రబాబు ఆఫర్ చేసినా పట్టించుకోని పవన్
- కేంద్రమంత్రి పదవికి యత్నిస్తున్నట్టు ప్రచారం
- అది వాస్తవమా? లేక ఉత్తుత్తి హంగామానా?
- అన్న విషయంలో తమ్ముడికి నెగిటివ్ ఫీలింగ్?
- ఆంధ్రప్రదేశ్ లో ఉండడం లేదని ఆరోపణ
- జనసేనాని మౌనం వెనుక మర్మమేమిటి?
సహనం వందే, అమరావతి:
నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!
నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం, జనసేన నుండి నాగబాబును ఎమ్మెల్సీగా మండలికి పంపడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే ఇప్పటికీ క్యాబినెట్‌లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎటువంటి అడ్డంకులూ లేవని, ఈ నిర్ణయం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉందని ఆయన స్వయంగా చెప్పడంతో చర్చకు తెరపడింది. ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర మంత్రి పదవిపై జనసేనాని దృష్టి?
జనసేనకు కేంద్రంలో ఒక మంత్రి పదవి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ మంత్రి పదవిని నాగబాబుకు ఇప్పించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంత్రి పదవిని బీసీ నేతకు ఇస్తే, సామాజిక సమీకరణాలు సమతుల్యం అవుతాయని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారట. అందుకే నాగబాబు విషయంలో పవన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరు మంత్రులు ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ ఆందోళన చెందుతున్నారని సమాచారం.
రాజ్యసభ లేదా పార్టీ బాధ్యతలు
నాగబాబు ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడు కావాలంటే 2026 వరకు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ బీజేపీ కోటాలో వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లి, ఏపీ కోటా ఖాళీ అయినప్పుడు జనసేన సీటును బీజేపీకి ఇవ్వవచ్చని కూడా ఒక వాదన ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంటే, నాగబాబును తమిళనాడు నుండి రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తారని అంటున్నారు. లేకపోతే 2026లో ఏపీ కోటా రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే వరకు నాగబాబు ఎమ్మెల్సీగా కొనసాగి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యాక కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని మరో అంచనా. నాగబాబుకు పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి నియోజకవర్గ పర్యటనలు, పార్టీ బలోపేతం, కార్యకర్తల బలోపేతంపై దృష్టి పెడతారని అంటున్నారు.
నాగబాబుపై ఇంకేమైనా అభిప్రాయమా?
నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినందున పార్టీకి అదనంగా లభించే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదని కూడా అంటున్నారు. నాగబాబు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాకపోవడం, ఏపీలో స్థిర నివాసం ఉండకపోవడం వంటి అంశాలను పవన్ పరిగణనలోకి తీసుకుంటున్నారట. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన చురుకుగా లేకపోయినా, సరిగా పనితీరు కనబరచకపోయినా తాను విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందేమోనని పవన్ వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. మరోవైపు తమ్ముడు పవన్ పట్ల నాగబాబు కూడా ఒకింత అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి అన్నదమ్ములు మంత్రులు అయితే తప్పేందని అంటున్నారు.