ప్రముఖులు జైళ్లలో అతిథులు – డబ్బుంటే జైళ్లు గెస్ట్ హౌస్ లే

  • జగన్… రేవంత్… బాబు… ఇప్పుడు మిథున్
  • ఇంటి భోజనం… ప్రొటీన్ పౌడర్… దోమ తెర
  • యోగా మ్యాట్… కిన్లే మినరల్ వాటర్
  • వీరందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన జైళ్లు
  • సాయిబాబా లాంటి వారికి వైద్యమే కరువు
  • జైలు అధికారుల విచక్షణ మేరకు సౌకర్యాలు

సహనం వందే, రాజమండ్రి:
‘జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటా’… ఈ వ్యాఖ్య చేసింది ఎవరో కాదు… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ధనికులకు చట్టం చుట్టం అవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తప్పుచేసి జైలుకు వెళ్లినప్పటికీ వారికి రాచ మర్యాదలు కల్పిస్తారు. ఒకప్పుడు జగన్… తర్వాత రేవంత్ రెడ్డి..‌. చంద్రబాబు నాయుడు… కవిత.‌.‌. ఇప్పుడు మిధున్ రెడ్డి. వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైళ్లు ఒకరకంగా ధనికులకు విశ్రాంతి కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తారు? పేద ఖైదీలకు మాత్రం జైలులో కనీస సౌకర్యాలకు దిక్కు ఉండదు. సరైన తిండి… వైద్యం లేక ఆసుపత్రుల్లో చనిపోతుంటారు. అంతెందుకు మావోయిస్టు గ్రూపులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జైలుకు వెళ్లిన ప్రొఫెసర్ సాయిబాబాకు కనీస వైద్యం అందక అనారోగ్యానికి గురయ్యారు. నిర్దోషి అని బయటకు వచ్చిన తర్వాత జైలులో పట్టి పీడించిన వ్యాధులతోనే ఆయన చనిపోయారు. ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందన్నడానికి ఇంతకుమించి నిదర్శనం ఏముంటుంది.

మిధున్ రెడ్డికి కిన్లే వాటర్ బాటిల్స్…
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డి తనకు మూడు పూటలా ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిల్స్, కొత్త పరుపు, మంచం, స్పెషల్ పిల్లోస్, వెస్ట్రన్ కమోట్ ఉన్న గది, టీవీ, సేవలు చేసేందుకు ఒక వ్యక్తి, న్యూస్ పేపర్లు, దోమ తెర, వాకింగ్ షూ వంటి వసతులు కావాలని కోరారు. అలాగే ప్రొటీన్ పౌడర్, ఒక టేబుల్, వైట్ పేపర్స్, పెన్ను, యోగా మ్యాట్ కూడా కావాలని అడిగారు. వాటిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.

చంద్రబాబుకి కల్పించిన వసతులు…
గతంలో చంద్రబాబు నాయుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నప్పుడు ఆయనకు ‘స్పెషల్ క్లాస్ ప్రిజనర్’ హోదా కల్పించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక గది, మంచం, వార్తా పత్రికలు, టేబుల్, కుర్చీ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇంటి నుండి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం, వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు, ఆరోగ్య సంబంధిత పరికరాలను కూడా అనుమతించారు.

వీఐపీ ఖైదీ అనే పదమే లేదు… కానీ?
జైళ్ల శాఖ నిబంధనావళిలో ఎక్కడా వీఐపీ ఖైదీ అనే పదం ఉండదని జైళ్ల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘ఖైదీకి ఉన్న ఆర్థిక స్థాయి, స్థోమత, జీవనశైలి, హోదాను పరిశీలించి స్పెషల్ క్లాస్ ప్రిజనర్ (ప్రత్యేక శ్రేణి ఖైదీ)గా పరిగణిస్తారు. అందుకు సదరు వ్యక్తి ముందుగా న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాలి’ అని ఒక అధికారి వివరించారు. జైళ్లలో ప్రముఖుల కోసం ప్రత్యేక బ్యారక్‌లు ఉంటాయని, స్పెషల్ క్లాస్ కింద కోర్టు పరిగణిస్తే జైలులో ప్రత్యేక గది, బెడ్, రీడింగ్ టేబుల్, కప్‌బోర్డు, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ వంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆయన తెలిపారు.

జైలులో ప్రత్యేక కిచెన్… వండించుకోవచ్చు
ఇంటి నుంచి సరుకులు తెప్పించుకుని జైలులో వండించుకుని తినొచ్చని, వంట వండే వ్యక్తిని జైలు తరపున ఇస్తారని లేదా న్యాయస్థానం అనుమతితో ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చని జైళ్ళ అధికారి ఒకరు వెల్లడించారు. ‘కోర్టు అనుమతి మేరకే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. బట్టలు ఉతకడానికి ప్రత్యేకంగా మనిషిని ఇస్తార’ని ఆ అధికారి చెప్పారు. అయితే స్పెషల్ క్లాస్ అనేది అడిగిన వారందరికీ ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. ఈ సౌకర్యాలు కావాలంటే ఐటీ రిటర్న్స్ సహా కోర్టు అడిగిన అన్ని రకాల పత్రాలు సమర్పించాలని వారు పేర్కొన్నారు.

సాధారణ వ్యక్తికి వర్తిస్తాయా?
ఒక రాజకీయ నాయకుడు జైలులో ఉంటే ఇన్ని వసతులు ఎందుకు కల్పించాలి? ఆరోగ్యం బాలేక ఇంటి భోజనం వగైరా అడిగారనుకుందాం. మరి సాధారణ వ్యక్తికి కూడా ఈ సౌకర్యాలు ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. చట్టపరంగా జైలులో ప్రత్యేక సౌకర్యాల కోసం నిర్దిష్ట నిబంధనలు లేవు. కానీ అవినీతి, అధికార రాజకీయాలు, వ్యవస్థలోని లోపాల కారణంగా ప్రముఖులు తరచుగా జైళ్లలోనూ అతిథులుగా ఉంటున్నారు. ఈ అసమానతలను తగ్గించడానికి జైలు సంస్కరణలు అవసరం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *