ముంచి ముంచి కొడతాం..బీజేపీ ఎంపీకి రాజ్ థాకరే స్ట్రాంగ్ వార్నింగ్

సహనం వందే, ముంబై: మరాఠీ మాట్లాడే వారిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరాఠీ ప్రజలపై దాడులు చేస్తామంటూ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. దూబే మరాఠీ సమాజాన్ని అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు.

‘ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి’
మరాఠీ ప్రజలను మేమిక్కడ పటక్ పటక్ కే మారేంగే (దాడులు చేస్తాము) అని దూబే అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో మంటలు రాజేశాయి. దీనిపై రాజ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ముంబైలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన బీజేపీ ఎంపీపై నిప్పులు చెరిగారు. ‘నువ్వు ముంబైకి రా.. నిన్ను ముంబై సముద్రంలో ముంచి ముంచి కొడతాం’ అంటూ నిషికాంత్ దూబేకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మరాఠీ భాష లేదా గుర్తింపుపై ఎలాంటి దాడిని తాను అంగీకరించబోనని థాకరే స్పష్టం చేశారు. ‘మరాఠీ భాష, మహారాష్ట్ర ప్రజల విషయంలో నేను ఎటువంటి రాజీపడను. మహారాష్ట్రలో నివసించే వారు వీలైనంత త్వరగా మరాఠీ నేర్చుకోండి. మీరు ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి’ అని ఆయన అన్నారు.

గుజరాతీ వ్యాపారవేత్తల కుట్ర…
ముంబై, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల మధ్య చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ్ థాక్రే ఆరోపించారు. ‘కొంతమంది గుజరాతీ వ్యాపారవేత్తలు ముంబై, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల మధ్య చీలిక తీసుకురావాలని ప్లాన్ చేశారు. వారు చాలా సంవత్సరాలుగా ముంబైపై దృష్టి పెట్టారు. వారు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని మహారాష్ట్ర వ్యతిరేకిస్తుందో లేదో వారు చూస్తున్నారు. మనం మౌనంగా ఉంటే హిందీ మొదటి అడుగు అవుతుంది. ప్రతిదీ గుజరాత్‌కు పంపడమే వారి ప్రణాళిక’ అని థాకరే అన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *