కుసుమ్ రాణి: ఢిల్లీ డ్రగ్ కోటకు మహా’రాణి’

  • గూఢచర్య పద్ధతులు, గండికోటలా ఇల్లు
  • ఇనుప గ్రిల్స్… యంత్రాలతో కదిలే తలుపులు
  • హెరాయిన్ అక్రమ రవాణాలో గుత్తాధిపత్యం
  • ఎట్టకేలకు గుట్టు రట్టు చేసిన ఢిల్లీ పోలీసులు

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుల్తాన్‌పురి గల్లీల్లో దాగిన ఓ రహస్య మాదకద్రవ్యాల సామ్రాజ్యం గుట్టు రట్టయింది. 52 ఏళ్ల కుసుమ్ రాణి అనే మహిళ హెరాయిన్ అక్రమ రవాణాను నడిపిన ఈ భారీ వ్యవస్థను పోలీసులు ఛేదించారు. ఆమె తెలివితేటలు, గూఢచర్య పద్ధతులు, గండికోటలా మార్చిన ఇల్లు పోలీసులను సైతం విస్మయపరిచాయి. మార్చిలో ఆమె కొడుకు అమిత్ అరెస్టు తర్వాత కుసుమ్ పరారీ కాగా, దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఆమె ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రహస్య రవాణా పద్ధతులు…
సుల్తాన్‌పురిలోని కుసుమ్ ఇల్లు బయటి నుంచి నాలుగు వేర్వేరు భవనాలుగా కనిపించేలా రూపొందించారు. ప్రతి ఇంటికి భిన్నమైన రంగు, డిజైన్ ఉండటంతో ఎవరికీ అనుమానం రాదు. అయితే లోపల గోడలను కూల్చివేసి, నాలుగు ఇళ్లను కలిపి ఒకే భారీ నిర్మాణంగా మార్చారు. ఇనుప గ్రిల్స్, పటిష్టమైన తాళాలు, యంత్రాలతో కదిలే తలుపులు, కిటికీలతో ఈ ఇల్లు ఒక కోటలా… దాదాపు జైలులా ఉంటుంది. హెరాయిన్‌ను బయటకు చేరవేయడానికి ఆమె ఒక తెలివైన పద్ధతిని అమలు చేసింది. తలుపుల వద్ద ఎవరితోనూ సంబంధం లేకుండా చిన్న బుట్టల్లో డ్రగ్ ప్యాకెట్లను ఉంచి, తాడుతో కిందకు దించడం లేదా కిటికీల్లోని చిన్న రంధ్రాల ద్వారా బయటకు పంపడం చేసేవారు.

సీసీటీవీ నిఘా… బాలల కాపలా
ఆమె తన రహస్య సామ్రాజ్యంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. ఇంటి చుట్టూ 17 సీసీటీవీ కెమెరాలను అమర్చింది. ఇవి రాత్రింబవళ్లు గల్లీల్లోని ప్రతి కదలికనూ రికార్డు చేసేవి. అంతేకాదు స్థానిక బాలలను కాపలాదారులుగా నియమించి గల్లీలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో నిఘా ఉంచేది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఆమెకు హెచ్చరికలు అందేవి. దీంతో డ్రగ్స్‌ను తక్షణమే దాచిపెట్టడం లేదా రహస్య మార్గాల ద్వారా తరలించడం జరిగేది.

కుసుమ్ కొడుకు అరెస్టు… ఆస్తుల స్వాధీనం
ఈ రహస్య సామ్రాజ్యంపై పోలీసులు నెలల తరబడి నిఘా ఉంచారు. మార్చిలో పోలీసులు ఒక సరఫరాదారు ఈ ఇంటి వద్దకు వస్తున్నట్లు గుర్తించి వేగంగా దాడి చేశారు. లోపల ఉన్నవారు స్పందించే లోపే ఇంట్లోకి ప్రవేశించి కుసుమ్ కొడుకు అమిత్ (26)ను అరెస్టు చేశారు. పోలీసులు అతడి వద్ద నుంచి 550 చిన్న హెరాయిన్ ప్యాకెట్లు, ట్రామడాల్ టాబ్లెట్లు, 14 లక్షల నగదు, ఒక స్కార్పియో ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుసుమ్ నుంచి ఎనిమిది భవనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏడు సుల్తాన్‌పురిలో, ఒకటి రోహిణి సెక్టార్ 24లో ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసినవని పోలీసులు స్పష్టం చేశారు.

అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు…
కుసుమ్ రాణి కుటుంబం ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఇద్దరు కూతుళ్లు గత ఏడాదిన్నర కాలంలో సుమారు 2 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలు చిన్న చిన్న మొత్తాల్లో (రూ. 2,000 నుంచి 5,000) అనేక ఖాతాల ద్వారా జరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 70 లక్షల రూపాయలు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. కుసుమ్ పేరుతో వివిధ జిల్లాల్లో, క్రైమ్ బ్రాంచ్‌లో 12 మాదకద్రవ్యాల కేసులు నమోదై ఉన్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *