- కుటుంబ సభ్యుడిని టచ్ చేసిన బాబు
- ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపు
- ఒక్కొక్క కీలక నేతపై అధికార పార్టీ టార్గెట్
సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడిని టచ్ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిపైనే తుపాకీ గురిపెట్టినట్లు అయింది. ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
జగన్ పరివారం అందరూ టార్గెట్టే…
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడుని జైలుకు పంపితే… అంతకు పది రెట్లు ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ పార్టీకి చెందిన ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ జగన్ కు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నారు. వల్లభనేని వంశీని జైలుకు పంపించి ఆయనను కుంగతీశారు. అంతేకాదు ఒక చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచారన్న కారణంతో సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుకు పంపించారు. అలాగే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేశారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ సాక్షి బ్యూరో ఇంచార్జ్ విశ్వనాథరెడ్డి సతీమణి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమెను విజయవాడ నుంచి ఏకంగా పాడేరుకు బదిలీ చేశారు. ఇలా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కార్యకర్తలను, సాక్షి జర్నలిస్టులను వేదనకు గురి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.
రాజమండ్రి జైలుకు మిధున్ రెడ్డి
ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన 10 పేజీల ‘అరెస్టుకు గల కారణాలు’ నివేదికలో వెల్లడైన సంచలన విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. మద్యం విధానంలో మార్పులు, అమలు, అలాగే ముడుపుల సేకరణలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన ఒక కుట్రదారుడిగా వ్యవహరించారని సిట్ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.

రూ. 3,500 కోట్ల మేర రాష్ట్రానికి నష్టం…
ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై సిట్ అధికారులు నివేదికలో వివరంగా పేర్కొన్నారు. మద్యం విధాన రూపకల్పన, దాని అమలులో ఆయన కీలక భూమిక పోషించారని, డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి పెద్ద ఎత్తున నగదు సేకరించి, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని అధికారులు వెల్లడించారు. ఈ భారీ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీ ట్రయల్‌ను సిట్ పక్కాగా గుర్తించినట్లు తెలిపింది. మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థలకు మద్యం ముడుపులు చేరాయని, ఈ నిధులను షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేశారని నివేదించింది. సుమారు రూ. 3,500 కోట్ల మేర రాష్ట్రానికి ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సిట్ అంచనా వేయడం ఈ కుంభకోణం తీవ్రతను తెలియజేస్తుంది.
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ…
మిథున్ రెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్‌ను పావుగా వాడుకొని ఈ కుట్రను అమలు చేశారని సిట్ వివరించింది. ఐఏఎస్ పదోన్నతి ఆశ చూపి సత్యప్రసాద్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించుకున్నారని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించారని, ఈ ముడుపులను 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని సిట్ తీవ్ర ఆరోపణలు చేసింది.
సిట్ విచారణలో కీలక వివరాలు… అరెస్టులు
సిట్ విచారణలో పలు సంచలన వివరాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు 268 మంది సాక్షులను విచారించిన సిట్, రూ. 62 కోట్ల నగదును సీజ్ చేసినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. మద్యం ముడుపులు వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడిగా మారినట్లు గుర్తించారు. ఈ కేసులో మిథున్ రెడ్డితో పాటు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్, విజయసాయిరెడ్డి వంటి వారి పేర్లు నిందితులుగా ఉండటం ఈ కేసు విస్తృతిని తెలియజేస్తుంది.
రాజకీయ కక్షసాధింపు: వైసీపీ
అయితే మిథున్ రెడ్డి అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమేనని… చంద్రబాబు, లోకేష్‌లు అధికారంలోకి రాగానే వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా విచారణకు హాజరైనప్పటికీ, ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తూ అరెస్టు చేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.