- ఈ నెలాఖరు నాటికి ఎన్ఎంసీ తనిఖీలు
- సీట్ల అనుమతుల కోసం పడరాని పాట్లు
- రోగులు లేకున్నా కేస్ షీట్ల తయారు
- బస్సుల్లో నకిలీ రోగులను తరలిస్తున్న వైనం
- ‘ఫాదర్ కొలంబో’ గుర్తింపు రద్దుతో టెన్షన్
సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ మాయలు ఒకటీ రెండు కావు. నకిలీ రోగులు… వారికి లేనిపోని రోగాలు అంటగట్టి కేస్ సీట్లు తయారు చేయటం… ఘోస్ట్ ఫ్యాకల్టీని సిద్ధం చేసుకోవడం… ఇలా ఆ కాలేజీ యాజమాన్యం రాత్రీ పగలు బిజీలో పడిపోయింది. ఈ నెలాఖరులోగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ఉండటంతో సినిమా సెట్టింగులా కాలేజీని సిద్ధం చేస్తున్నారు. కొన్ని పరికరాలను బయట నుంచి తెప్పించి తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్ఎంసీ అధికారులు కొందరు ఆ కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కు అవుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎన్ఎంసీ అధికారులు కొందరు ఆ కాలేజీకి సమాచారం ఇస్తూనే ఉన్నారు. అందుకోసం కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతుంది.

అదనపు సీట్ల కోసం ప్రయత్నాలు...
మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 250 ఎంబీబీఎస్ సీట్లకు పెంచుకునేందుకు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసినట్టు సమాచారం. అలాగే పీజీ తరగతుల ప్రారంభం సందర్భంగా కూడా ఎన్ఎంసీ తనిఖీలు చేపడుతుంది. అయితే ఆ మేరకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో యాజమాన్యం విఫలం చెందిందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఎన్ఎంసీకి చెందిన కొంతమంది అధికారులను యాజమాన్యం మేనేజ్ చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ముందస్తుగా సమాచారం ఇచ్చి తనిఖీలు చేసి అంతా సవ్యంగా ఉందని ఒప్పించేలా చేసేందుకు కొందరు ఎన్ఎంసీ అధికారులకు దాదాపు కోట్లు ఇచ్చేందుకు డీల్ మాట్లాడినట్లు ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కాగా మూడేళ్ల క్రితం తనిఖీల సందర్భంగా అనేక లోపాలు గుర్తించడంతో ఆ కాలేజీకి ఆ ఏడాది ఏకంగా సీట్లనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులను వివిధ కాలేజీల్లో సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయినా యాజమాన్యం తన తీరును మార్చుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్ఎంసీ అధికారులు ఆ కాలేజీ వ్యవహారం తెలిసి కూడా ముందస్తు సమాచారం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
‘సహనం వందే’తో నాడు తనిఖీలకు బ్రేక్…
మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇటీవలనే తనిఖీలు జరగాల్సి ఉంది. ఆ మేరకు ఎన్ఎంసీ అధికారులు ఆ కాలేజీకి ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారం చేసుకుని నకిలీ రోగులను… ఘోస్ట్ ఫ్యాకల్టీని సిద్ధం చేసుకున్నారు. అయితే ముందస్తు తనిఖీల వ్యవహారాన్ని ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=5051 ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. దీంతో ఎన్ఎంసీ తనిఖీలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సహనం వందే, ఆర్టికల్ టుడే డిజిటల్ https://articletoday.in/mahaveer-s-inspection-leak-allegations/ పేపర్లలో వచ్చిన కథనాలతో ఎన్ఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. ఈ విషయం ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి కూడా వెళ్లడంతో సంబంధిత అధికారులపై ఆయన సీరియస్ అయినట్లు సమాచారం.

సీబీఐ కేసులు… అరెస్టులు
మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ తనిఖీల ప్రక్రియలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలో అనేక మెడికల్ కాలేజీలలో అక్రమాలు బయటపడటంతో సీబీఐ కేసులు పెడుతోంది. పరిస్థితి రచ్చ రచ్చ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ పైనే వేటు వేసింది. ఎన్ఎంసీ లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది.
సీబీఐ దర్యాప్తులో ఎన్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు, దళారులు, వైద్య కళాశాలల నిర్వాహకులతో కలిసి కోట్ల రూపాయల లంచాలు మేసినట్లు తేలింది. ఏ మాత్రం వసతులు లేని కాలేజీలకు అనుమతులు కట్టబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీకి ముడుపులు ఇచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో తేలడంతో రద్దు చేశారు. అలాగే ఛత్తీస్ ఘడ్ లో తనిఖీ బృందంలో ఉన్న హైదరాబాద్ డాక్టర్ రజినీరెడ్డి పైన కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని అక్రమాలు బయటపడటంతో మహావీర్ మెడికల్ కాలేజీ వ్యవహారంలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.