రేవంత్ వర్సెస్ రాజ’కోపాల్’ – ‘నేనే సీఎం’ రగడ

  • ‘రాబోయే పదేళ్లు నేనే సీఎం’ వ్యాఖ్యలపై ఫైర్
  • తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ సామ్రాజ్యమా?
  • అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక
  • రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
  • మంత్రి పదవి ఇవ్వక పోవడంతో అసంతృప్తి
  • ఇతర నేతల్లోనూ రాజుకుంటున్న ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: ‘రాబోయే పదేళ్లు నేనే సీఎం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లను కలవర పెడుతున్నాయి. ఈ ప్రకటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించడంతో పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ సామ్రాజ్యం నడుస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘పదేళ్ల సీఎం’ ప్రకటన దుమారం
జటప్రోలులో జరిగిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా’ అని ఆయన ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి ఈ విధంగా ప్రకటించడం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకమని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక జరుగుతుందని రాజగోపాల్‌ రెడ్డి తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

స్ట్రాంగ్‌ కౌంటర్‌
రేవంత్‌ వ్యాఖ్యలను కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైరల్‌గా మారింది.

మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి…
రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తిలో భాగంగానే ఈ విమర్శలు చేస్తున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇతర సీనియర్‌ నేతలు కూడా రేవంత్‌ తీరుపై మండిపడుతున్నారు. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న కొందరు నాయకులు రేవంత్‌ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు
రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతికి దారితీస్తున్నాయి. సీనియర్‌ నేతలు, కార్యకర్తలు రేవంత్‌ తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలను గౌరవించకుండా, తెలంగాణ కాంగ్రెస్‌ను తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం పార్టీ ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రకటన పార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న ఇతర నేతలను ఈ వ్యాఖ్యలు ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వివాదం పార్టీ ఐక్యతను దెబ్బతీస్తుందా? లేక రేవంత్‌ రెడ్డి తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటారా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

అధిష్టానం జోక్యం అనివార్యమా?
రేవంత్ రెడ్డి ప్రకటన, దానిపై రాజగోపాల్ రెడ్డి సహా ఇతర నేతల నుంచి వస్తున్న ప్రతిస్పందనలు కాంగ్రెస్ పార్టీలో తలెత్తుతున్న అసమ్మతిని స్పష్టంగా సూచిస్తున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాలకు ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుంది, పార్టీలో అంతర్గత సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది అనేది చూడాలి. లేకపోతే ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *