- ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు
- తనిఖీ బృందాలకు 46 లక్షల లంచం కారణం
- మరికొన్ని కాలేజీలపై కొనసాగుతున్న దర్యాప్తు
సహనం వందే, హైదరాబాద్:
ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సీబీఐ వేట మొదలైంది. కాలేజీల గుర్తింపు, సీట్ల రెన్యువల్ కోసం ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు లంచం ఇచ్చినట్టు అనేక కాలేజీలపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ పై వేటు వేసిన అనంతరం ఇప్పుడు కాలేజీ మాఫియాలకు చుక్కలు చూపిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు కావడంతో వైద్య విద్యారంగంలో సంచలనం రేగింది. కళాశాల ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి రెండు దఫాలుగా రూ. 46 లక్షలు లంచం ఇచ్చారని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది. ఈ కారణంగానే ఆ కళాశాల గుర్తింపు రద్దయిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో ఇంకా కొన్ని కాలేజీలకు సంబంధించి ఎన్ఎంసీ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. వికారాబాద్ లో ఉన్న మహావీర్ మెడికల్ కాలేజీకి తనిఖీలకు వస్తామని ముందస్తు సమాచారం ఇచ్చారు. దాన్ని ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో ఎన్ఎంసీ అధికారులు ఆరోజు రాకుండా వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కాలేజీలో తనిఖీలు జరగాల్సి ఉంది. ఈనెల 29వ తేదీ నాటికి తనిఖీలు చేస్తామని ఎన్ఎంసీ అధికారులు ఆ కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
కుంభకోణం వివరాలు…
సీబీఐ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీ బృందాలు వైద్య కళాశాలలకు వెళ్లడానికి ముందే ఆ సమాచారాన్ని కళాశాలల ప్రతినిధులకు చేరవేస్తున్నారని సీబీఐ స్పష్టం చేసింది. ఈ ముందస్తు సమాచారం ఆధారంగా కళాశాలలు తాత్కాలికంగా నిబంధనలను పాటిస్తున్నట్లు చూపించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. అనుకూల నివేదికల కోసం తనిఖీ

అనుకూల నివేదికల కోసం తనిఖీ బృందాల సభ్యులకు కళాశాలల యాజమాన్యాలు కోట్లకు కోట్లు గుమ్మరించాయి. నకిలీ రోగులు, ఘోస్ట్ ఫ్యాకల్టీ, ఇతర సిబ్బందిని నియమించుకున్నారని, కొన్ని చోట్ల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలను కూడా మార్చేశారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఎన్ఎంసీ తనిఖీ బృందాలు కళాశాల యాజమాన్యాల నుంచి కోట్ల లంచాలు తీసుకుంటూనే, వారికి ముందస్తు సమాచారం ఇస్తూ వచ్చాయి.
నిందితుల జాబితాలో జోసెఫ్ కొమ్మారెడ్డి…
సీబీఐ నమోదు చేసిన కేసులో మాజీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ డి.పి. సింగ్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లోని శ్రీ రావత్‌పురా సర్కార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధినేత, స్వామీజీ రవి శంకర్‌జీ మహారాజ్, రాజస్థాన్‌లోని గీతాంజలి యూనివర్సిటీ రిజిస్ట్రార్ మయూర్ రావల్, మధ్యప్రదేశ్‌లోని ఇండెక్స్ మెడికల్ కాలేజీ ఛైర్మన్ సురేష్ సింగ్ బదౌరియా, విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్, వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతినిధి ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి, ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతినిధి శివానీ అగర్వాల్, గుజరాత్‌లోని స్వామినారాయణ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ ప్రతినిధి స్వామి భక్తవత్సల్‌దాస్ జీ ఉన్నారు.