రీజినల్ రింగ్ రైలుతో ట్రాఫిక్ కు చెక్

  • తెలంగాణకు కొత్త రైల్వే మార్గాలు ఇవ్వండి
  • కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదన
  • రైల్వే ప్రాజెక్టులను ఆమోదించాలని విన్నపం
  • కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీతో సీఎం భేటీ

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణను సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో పాటు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినూత్న ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.

రీజినల్ రింగ్ రైలు…
రాష్ట్రంలో రైల్వే అనుసంధానతను పెంచేందుకు పలు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని, దీనికి రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.

అభివృద్ధికి దోహదపడే రీజినల్ రింగ్ రైలు
ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడమే కాకుండా, హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. రీజినల్ రింగ్ రైలు వల్ల గ్రామీణ పేదరికం తగ్గి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందరు ఓడరేవుకు రైలు మార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలు
తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతుల కోసం, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి అందజేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కిలోమీటర్లు, అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కిలోమీటర్లు, అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కిలోమీటర్లు, అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కిలోమీటర్లు, అంచనా వ్యయం రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *