- ఆయిల్‌ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ నిర్వాకం
- ఒక ప్రైవేట్ సంస్థతో కుమ్మక్కే కారణం
- ఆ సంస్థకు కోట్ల విలువైన బ్రాండ్ అప్పగింత
- సరుకులు అమ్మేందుకనే పేరుతో లాలూచీ
- ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తక్కువ అద్దెకు దుకాణం
- నాసిరకం సరుకులు అమ్ముతున్న వ్యాపారి
- కమీషన్ల కోసమే ఇలా చేశారన్న విమర్శలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణకు చెందిన ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్‌ను కాపాడుకునే పేరుతో ఆయిల్‌ఫెడ్ ఓ ప్రైవేటు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ‘విజయ హైదరాబాద్’ నూనెలను విక్రయిస్తున్న టీఎస్-ఆయిల్‌ఫెడ్… కేవలం బ్రాండ్ పేరును, తమ గోదామును అత్యంత తక్కువ అద్దెకు ఇచ్చి చేతులు దులుపుకుందనే విమర్శలు వచ్చాయి.

ప్రైవేటుకు అపరిమిత లబ్ధి…
ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ గా తిరుమలేశ్వర్ రెడ్డి ఈ కీలకమైన వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో విలువైన విజయ హైదరాబాద్ బ్రాండ్ పేరును పదేళ్లకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రతిఫలంగా తొలి ఐదేళ్లు కేవలం 0.5 శాతం రాయల్టీ, ఆపై ఐదేళ్లు 0.75 శాతం రాయల్టీ తీసుకోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉన్న ఈ బ్రాండ్‌కు ఇంత తక్కువ రాయల్టీ సరిపోతుందా? కేవలం పది లక్షల రూపాయల ఫ్రాంచైజీ రుసుముతోనే ఈ ఒప్పందానికి ఎందుకు అంగీకరించారన్న అనుమానాలు ఉన్నాయి.
ప్రభుత్వ గోదాము ప్రైవేటుకు అప్పగింత…
ఈ ఒప్పందంలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ కపాడియాలో ఉన్న ఆయిల్‌ఫెడ్ గోదామును, సేల్స్ పాయింట్ ను యునిస్టెమ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎల్ఎల్‌పీకి అద్దెకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ గోదామును నెలకు కేవలం రూ. 45,000 అద్దెకు అప్పగించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఒప్పందాల వల్ల ప్రభుత్వానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది? ప్రజలకు ఏ మేరకు మేలు జరుగుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాసిరకం సరుకులు అమ్ముతూ చెడ్డ పేరు…
ఆ ప్రవేట్ సంస్థ విజయ బ్రాండ్ తో నిత్యావసర సరుకులను వినియోగదారులకు విక్రయిస్తుంది. బాస్మతీ బియ్యం, గోధుమ, జొన్న, రాగి పిండి, మసాలా టీ, అన్ని రకాల డ్రైఫ్రూట్స్, సుగంధద్రవ్యాలు, ఉప్పు కలిపిన శనగలు, తినుబండారాలు… ఇలా 22 రకాల నిత్యావసరాలను మార్కెట్లోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఆయిల్ ఫెడ్ ఏమాత్రం పెట్టుబడి పెట్టకుండా లాభం పొందుతుందని అప్పట్లో ఊదరగొట్టారు. అన్ని సూపర్ బజార్లు, కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతామని ప్రచారం చేసుకున్నారు.
అనంతరం 200 ఔట్లెట్లు తెరుస్తామని తెలిపారు. ఔట్లెట్లలో వంద రకాల నిత్యావసర సరుకులు, విజయ పాలు, నూనెలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇదంతా జరిగిందేమీ లేదు కానీ… ఆయిల్ ఫెడ్ కు ప్రయోజనం కంటే ఆ ప్రైవేట్ వ్యాపారికి లాభం చేకూరుస్తుంది. అంతేకాదు విజయ బ్రాండ్ కు చెడ్డపేరు తెచ్చేలా నాసిరకం సరుకులు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాదుకు చెందిన వినియోగదారుడు చింతకింది శ్రీనివాస్ మాట్లాడుతూ… తాను విజయ బ్రాండ్ చూసి అక్కడ సరుకులు కొన్నానని… కానీ నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రైవేటు వ్యక్తితో లాలూచీ పడినట్లు ఆయిల్ ఫెడ్ చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.