- గోకర్ణ గుహలో గుట్టుగా రష్యన్ మహిళ
- 8 ఏళ్లుగా ప్రకృతి ఆహారంతోనే జీవితం
- రాముడి విగ్రహానికి పూజలు… ధ్యానం
- ప్రమాదకరమైన ప్రాంతంలో జీవనం
- ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉండటంపై చర్చ
సహనం వందే, బెంగళూరు:
కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఉన్న రామతీర్థ కొండల గుహలో రష్యన్ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనిమిదేళ్లుగా రహస్యంగా జీవిస్తోంది. ఈ 40 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రేమ, నాలుగేళ్ల కూతురు ఆమాతో కలిసి ఆధ్యాత్మిక జీవనం సాగించింది. ఆమె వీసా 2017లోనే ముగిసినప్పటికీ, భారతదేశంలోనే ఉంటూ గోకర్ణ అడవుల్లో దాక్కుంది. జులై 9న సాధారణ గస్తీలో ఉన్న గోకర్ణ పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించి సురక్షితంగా రక్షించారు. ఈ అసాధారణ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గోవా నుంచి గోకర్ణకు: ఆధ్యాత్మికపై ఆకర్షణ
నీనా కుటినా 2016 అక్టోబరులో వ్యాపార వీసాపై భారతదేశానికి వచ్చింది. గోవాలో ఒక ప్రైవేటు సంస్థలో కొంతకాలం పనిచేసిన ఆమె, 2017 ఏప్రిల్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత రష్యాకు వెళ్లకుండా నేపాల్‌కు వెళ్లింది. 2018 సెప్టెంబరులో మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చి గోవాలో నివసించింది. హిందూ ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి పట్ల ఆమెకు ఆకర్షణ పెరిగింది. ఈ నేపథ్యంలో గోకర్ణలోని రామతీర్థ కొండల్లోని ఒక గుహలో ఆశ్రయం పొందింది. ఆమె తన కూతుళ్లతో కలిసి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంది. గుహలో రాముడి విగ్రహాన్ని ఉంచి పూజలు, ధ్యానం చేస్తూ ఆమె రోజులు గడిపింది.
ప్రమాదకరమైన గుహలో జీవనం…
రామతీర్థ కొండలు ప్రమాదకరమైన ప్రాంతం. 2024 జులైలో ఇక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే దట్టమైన అడవులు, విషసర్పాల కారణంగా ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ నీనా తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఈ గుహలో జీవించడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ ఎం. నారాయణ మాట్లాడుతూ… ఈ కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించింది, ఏం తిన్నదనే విషయం ఆశ్చర్యకరమని చెప్పారు. నీనా తన ఆహారం గురించి స్పష్టంగా చెప్పకపోయినా ధ్యానం, ప్రకృతి పట్ల ఉన్న మక్కువతో జీవించినట్లు వివరించింది. నీనా ఇద్దరు కూతుళ్లు భారతదేశంలోనే జన్మించారని పోలీసులు తెలిపారు. అయితే వారి తండ్రి గురించి ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రమాదకరమైన వాతావరణంలో ఈ చిన్నారులు ఎలా సురక్షితంగా ఉన్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తిరిగి రష్యాకు తరలించే ప్రక్రియ
పోలీసుల సలహాలతో నీనా, ఆమె పిల్లలను గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉన్నారు. సోమవారం నీనా, ఆమె పిల్లలను బెంగళూరులోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)కు తరలించి, రష్యాకు తిరిగి పంపే ప్రక్రియ ప్రారంభిస్తారు. రష్యన్ ఎంబసీతో సమన్వయం చేస్తూ ఈ కుటుంబం రష్యాకు తిరిగి వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు