ఎన్ఎంసీ చైర్మన్ ఔట్… దేశవ్యాప్తంగా ప్రకంపనలు

  • మెడికల్ కాలేజీల వేల కోట్ల ఎన్ఎంసీ ముడుపుల స్కాం
  • అర్హత లేకున్నా గుర్తింపు ఇవ్వడమే కారణం
  • సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో డాక్టర్లపై చర్యలు?
  • నిందితుల జాబితాల్లో తెలుగు డాక్టర్లు
  • డాక్టర్ రజినీరెడ్డి, వెంకట్, జోసెఫ్ కొమ్మారెడ్డి
  • వారిలో అనేక మందిని అరెస్టు చేసే అవకాశం
  • అయినా మారని ఎన్ఎంసీ బృందాల తీరు

సహనం వందే, న్యూఢిల్లీ:
నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్ ను నియమించింది. దేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు… సీట్ల పునరుద్ధరణలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ నే తొలగించటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇంకా మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ కేసులో కీలకమైన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వైద్య విద్య ప్రమాణాలను పర్యవేక్షించే ఎన్‌ఎంసీ, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులు, మధ్యవర్తులు ఈ కుట్రలో భాగస్వాములైనట్లు సీబీఐ గుర్తించింది. అక్రమాలకు పాల్పడి, లంచాలు తీసుకుని తనిఖీల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది.

సీబీఐ ఎఫ్‌ఐఆర్ లో కుంభకోణం వివరాలు…
ఈ కుంభకోణంలో ప్రధానంగా తనిఖీ బృందాలు మెడికల్ కాలేజీలకు వెళ్లడానికి ముందే… ఆ సమాచారాన్ని కాలేజీల ప్రతినిధులకు చేరవేస్తున్నారని సీబీఐ స్పష్టం చేసింది. ఈ సమాచారం ఆధారంగా కాలేజీలు తాత్కాలికంగా నిబంధనలను పాటిస్తున్నట్లు చూపించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. అలాగే అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు తనిఖీ బృందాల సభ్యులకు కాలేజీల యజమాన్యాలు కోట్లు గుమ్మరించాయి. నకిలీ రోగులు ఘోస్ట్ ఫ్యాకల్టీ, సిబ్బందిని నియమించుకున్నారని, కొన్ని చోట్ల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలను కూడా మార్చేశారని సీబీఐ ఎఫ్‌ఐఆర్ లో పేర్కొంది. ఇంత జరుగుతున్నప్పటికీ తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాల నుంచి కోట్ల లంచాలు తీసుకుంటున్నాయి. ఆ ప్రకారం కాలేజీలకు ముందస్తు సమాచారం ఇస్తూనే ఉన్నారు.

నిందితుల జాబితాలో తెలుగు వాళ్లు కూడా…
సీబీఐ నమోదు చేసిన కేసులో మాజీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ డి.పి. సింగ్ తోపాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లోని శ్రీ రావత్‌పురా సర్కార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్ఆర్ఎస్ఐఎంఎస్ఆర్) అధినేత, స్వామీజీ రవి శంకర్ జీ మహారాజ్, రాజస్థాన్‌లోని గీతాంజలి యూనివర్సిటీ రిజిస్ట్రార్ మయూర్ రావల్, మధ్యప్రదేశ్‌లోని ఇండెక్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ సురేష్ సింగ్ బదౌరియా, విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్, వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతినిధి ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి, ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతినిధి శివానీ అగర్వాల్, గుజరాత్‌లోని స్వామినారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ ప్రతినిధి స్వామి భక్తవత్సల్‌దాస్ జీ ఉన్నారు. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పూనమ్ మీనా, ధరంవీర్, పియూష్ మల్యాన్, అనుప్ జస్వాల్, రాహుల్ శ్రీవాత్సవ, చందన్ కుమార్, దీపక్, మనీషా, ఎన్‌ఎంసీ తనిఖీ బృందం సభ్యులు చిత్ర ఎం.ఎస్., పి. రజిని రెడ్డి, మంజప్ప సి.ఎన్., అశోక్ షెల్కేలతో పాటు పలువురు మధ్యవర్తుల పేర్లను కూడా సీబీఐ తన నివేదికలో పేర్కొంది.

నిందితుడు… ఒక స్వామీజీ
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి శంకర్ జీ మహారాజ్ ను సాధారణంగా రావత్‌పురా సర్కార్ అని పిలుస్తారు. ఈయన 2000వ సంవత్సరంలో భింద్ లో రావత్‌పురా సర్కార్ లోక్ కళ్యాణ్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్‌కు పాఠశాలలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలు, నర్సింగ్, ఫార్మసీ కళాశాలలతో పాటు అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఈ స్వామీజీకి అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు అనుచరులుగా ఉన్నారు. ఈ కుంభకోణం వైద్య విద్య రంగంలో నెలకొన్న లోపాలను, అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో మరోసారి నిరూపించింది. సీబీఐ దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *