ఆ రిపోర్టులోనే… ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల బాగోతం

  • నాటి ఎండీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నివేదిక
  • నిజానిజాలు… అక్రమాలపై సమగ్ర వివరాలు
  • మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి వాటిపై ఎక్స్ రే
  • విస్తుపోయే నిజాలు… అక్రమాలతో రిపోర్ట్
  • దీని ప్రకారం చర్యలు తీసుకుంటే కొందరు ఔట్
  • అక్రమార్కుల ఒత్తిడితో తొక్కిపెట్టిన పెద్దలు
  • దాన్ని బయటపెట్టాలని ఉద్యోగుల డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:
ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి… ఆయిల్ ఫెడ్ కు కొద్ది నెలలపాటు ఎండీగా పనిచేశారు. ఆయన ఉన్న కొన్ని రోజుల్లోనే కార్పొరేషన్ ను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. అంతకు ముందు జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. అందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక తయారు చేయించారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా సురేందర్ పనిచేసిన కాలంలో చేపట్టిన కార్యక్రమాలు… అందులో జరిగిన అక్రమాలు ఈ రిపోర్టులో సమగ్రంగా పొందుపరిచారు. ఆ రిపోర్టు ప్రకారం కొందరిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలోనే అశోక్ రెడ్డి బదిలీ కావడం గమనార్హం. ఆయన బదిలీ అనంతరం ఆ రిపోర్టును తొక్కి పెట్టినట్లు విమర్శలు ఉన్నాయి. ఆ రిపోర్టులోనే ఆయిల్ ఫెడ్ లోని కొందరు అక్రమార్కుల బాగోతం ఉన్నట్లు చెపుతున్నారు. దాన్ని బయటకు తీసి చర్యలు మొదలు పెడితే ఇప్పుడున్న కొందరు అధికారులు సస్పెండ్ కావాల్సిందేనని అంటున్నారు. ఆ రిపోర్టును బయటపెట్టాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

ఆ నివేదికలో ఏముంది?
ఐదేళ్ల కాలంలో ఆయిల్ ఫెడ్ లో చేపట్టిన కార్యక్రమాలు, ఆ సందర్భంగా జరిగిన అక్రమాలను అన్నింటినీ క్షుణ్ణంగా పొందుపరిచినట్లు తెలిసింది. ఆ కాలంలో ప్రధానంగా ఆయిల్ పామ్ సాగు, కంపెనీల ఎంపిక, విదేశాల నుంచి మొలకలు తెప్పించడం, నర్సరీల ఏర్పాటుకు ఏజెన్సీలను వెతకడం, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లు… ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వందల కోట్ల రూపాయలు అందుకోసం కేటాయించారు. ఈ సందర్భంగా కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అంచనా వేశారు. ఉదాహరణకు అశ్వారావుపేట నర్సరీలో మొక్కల గోల్మాల్ వ్యవహారం వెలుగు చూసింది. ఆ సమయంలో పనిచేసిన ఒక అధికారి బాధ్యునిగా గుర్తించారు. అతని నుంచి 40 లక్షల రూపాయలు రికవరీ చేయాలని నిర్ణయం కూడా జరిగింది. కానీ అతన్ని అప్పటి ఎండీ కాపాడినట్లు విమర్శలు ఉన్నాయి.

ఆయిల్ ఫెడ్ నర్మెట్ట ఫ్యాక్టరీ

నివేదికలోని కొన్ని అంశాలు…

  • ఆయిల్ పామ్ తోటల్లో జన్యు లోపం, ఆఫ్-టైప్ మొక్కలు గుర్తించారు.
  • మార్గదర్శకాల ప్రకారం నర్సరీలో మొక్కలు పెంచలేదు. నర్సరీ దశలో కల్లింగ్ జరిగింది.
  • అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం, సత్తుపల్లి మండలం రేగళ్లపాడులోని నర్సరీల నుంచి ఇచ్చిన మొక్కల్లో 20 నుంచి 50 శాతం వరకు జన్యు లోపాలతో హాఫ్‌ టైపు మొక్కలు రైతుల క్షేత్రాల్లోకి చేరాయి.
  • 2022 వరకు అశ్వారావుపేట నర్సరీల కుంభకోణాలలో ప్రధాన నిందితులు… 2021 నుండి 2024 వరకు దాదాపు కోటి మొక్కల దిగుమతిలో కీలక పాత్ర పోషించిన వారిపై చర్యల గురించి.
  • విజయ నూనె మార్కెట్లో తన వాటాలను పెంచుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ప్రైవేట్ కంపెనీలు దూసుకుపోతున్నా తన వాటాను పెంచుకోలేకపోతోంది.
  • నర్మెట్టలో ఫ్యాక్టరీని నిర్మించేందుకు రూ. 247 కోట్లు అవసరమని నిర్ధారించి బోర్డు ఆమోదం తీసుకున్నారు. 30 మెట్రిక్ టన్నుల నుంచి 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీ అవసరమని తేల్చారు. నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటే తెరపైకి మళ్లీ బీచుపల్లి, తొర్రూరు ఫ్యాక్టరీల ప్రతిపాదనలు తీసుకురావడానికి బాధ్యులు ఎవరు?
  • ఆయిల్ ఫెడ్ వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, ప్రైవేట్ కంపెనీలు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాయి. 13 ప్రైవేట్ పామాయిల్ ప్రాసెసింగ్ కంపెనీలకు జోన్లు కేటాయించారు. వారి తోటలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా ఏ కంపెనీ ఫ్యాక్టరీలను నిర్మించడం లేదు.
  • 2021కి ముందు తెలంగాణ ఆయిల్ ఫెడ్ లాభాలతో ఉంది. కానీ తర్వాత అది అప్పుల్లో ఉంది.
  • సంస్థ ఉద్యోగులు కొందరు సబ్ కాంట్రాక్ట్ అవతారం ఎత్తడం. ప్రైవేట్ కంపెనీలకు అమ్ముడుపోయి వారితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండటం.
  • ప్రీ యూనిక్ కంపెనీ చేతుల్లోనే దాదాపు పది ప్రాజెక్టులు ఉన్నాయి. నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి టెండర్లలో జాప్రో కంపెనీ తక్కువకు కోట్ చేసినప్పటికీ సాంకేతిక కారణాలు చూపించి ప్రీ యూనిక్ కంపెనీకి దక్కేలా చేయడంలో కీలక పాత్రధారులు.
  • అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీలలో అవసరం ఉన్నా లేకపోయినా కమీషన్ల కోసం మిషనరీ, స్పేర్ పార్ట్స్ తెప్పించినట్లు నిర్ధారణకు వచ్చారు. అందులో సూత్రధారి అయిన అధికారి ఇప్పుడు కీలక స్థానంలో ఉన్నారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *