ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరి… ఒంటరితనం పెనుభూతం

  • గుండె జబ్బులు… షుగర్… పక్షవాతం
  • ఒంటరితనంతో గంటకు 100 మంది మృతి
  • ఏడాది 8.71 లక్షల మందికి పైగా మరణం
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి
  • సామాజిక సంబంధాలతోనే దీర్ఘాయుష్షు

సహనం వందే, జెనీవా:
ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం ఒక పెనుభూతంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌ఓ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒంటరితనం వల్ల ప్రతి గంటకు సుమారు వంద మంది మరణిస్తున్నారని వెల్లడించింది. అంటే సంవత్సరానికి దాదాపు 8.71 లక్షల మందికి పైగా అకాల మరణాల బారిన పడుతున్నారని అంచనా వేసింది. బలమైన సామాజిక సంబంధాలు మెరుగైన ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షుకు దోహదపడతాయని నివేదిక నొక్కి చెప్పింది.

ఒంటరితనం ఈ కాలపు ప్రధాన సమస్య…
డబ్ల్యూహెచ్‌ఓ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ కో-ఛైర్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మాట్లాడుతూ, ‘ఒంటరితనం, సామాజిక ఒంటరితనం మన కాలపు ప్రధాన సవాల్’ అని పేర్కొన్నారు. సామాజిక సంబంధాల మధ్య అంతరం వల్ల కలిగే బాధాకరమైన భావననే ఒంటరితనం అని, అవసరమైన సామాజిక సంబంధాలు లేకపోవడాన్ని సామాజిక ఒంటరితనం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.

యవ్వనంపై ఒంటరి పోటు…
ఒంటరితనం అన్ని వయసుల వారినీ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువతను, తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో నివసించే ప్రజలను ఎక్కువగా బాధిస్తుంది. 13-29 సంవత్సరాల వయస్సు వారిలో 17 నుంచి 21 శాతం మంది ఒంటరితనంగా భావిస్తున్నారని పేర్కొంది. యువతలో ఈ రేటు అత్యధికంగా ఉంది. తక్కువ-ఆదాయ దేశాలలో సుమారు 24 శాతం మంది ఒంటరితనంగా భావిస్తున్నారని వెల్లడైంది. ‘ప్రజలు సంబంధాలు పెంచుకోవడానికి అంతులేని అవకాశాలున్న ఈ రోజుల్లో..‌. ఎక్కువ మంది తమను తాము ఒంటరిగా, నిస్సహాయంగా భావిస్తున్నారు. ఇది వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలపై తీవ్ర ప్రభావం చూపుతుంద’ని నివేదిక స్పష్టం చేసింది.

గుండె జబ్బులు… షుగర్
ఒంటరితనం, సామాజిక ఒంటరితనానికి అనేక కారణాలు ఉన్నాయి. పేలవమైన ఆరోగ్యం, తక్కువ ఆదాయం, విద్య లేకపోవడం, ఒంటరిగా జీవించడం, తగినంత సామాజిక మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వ విధానాల్లో లోపాలు, డిజిటల్ సాంకేతికతల అధిక వినియోగం వంటివి ఇందులో ఉన్నాయి. సామాజిక సంబంధాలు శరీరంలో మంటను తగ్గించగలదు. అకాల మరణాన్ని నిరోధించగలదు. ఒంటరితనం పక్షవాతం, గుండె జబ్బులు, మధుమేహం, జ్ఞాపకశక్తి క్షీణత, అకాల మరణం ప్రమాదాన్ని పెంచుతాయి. ఒంటరిగా ఉండే వ్యక్తులకు డిప్రెషన్ వచ్చే అవకాశం రెట్టింపు.

నాట్ అలోన్..‌.
ఒంటరితనం, సామాజిక ఒంటరితనాన్ని తగ్గించడానికి పరిష్కారాలు ఉన్నాయి. పార్కులు, లైబ్రరీలు, కేఫ్‌లు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి వ్యక్తి చిన్న చిన్న పనుల ద్వారా దాన్ని అధిగమించవచ్చు. స్నేహితుడికి సాయం చేయడం, ఫోన్‌ను పక్కన పెట్టడం, పొరుగు వారిని పలకరించడం, స్వచ్ఛందంగా పనిచేయడం వంటివి ఇందులో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ సామాజిక సంబంధాలను ప్రోత్సహించడానికి ‘నాట్ అలోన్’ అనే కొత్త ప్రచారాన్ని కూడా ప్రకటించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *