- కల్లింగ్ మొక్కలు ఉండకూడదని ఆదేశం
- ఆయిల్ పామ్ సాగు ప్రగతిపై అసహనం
- రైతులకు బిల్లులు ఆలస్యం కావద్దని ఆదేశం
- ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో నెలకొన్న మందకొడి పరిస్థితిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సరీల్లో నాసిరకం మొక్కలు (కల్లింగ్ మొక్కలు) ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మొక్కలు ఏ మాత్రం ఉండకూడదని… రైతులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన వాటినే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మంగళవారం ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఆయిల్ పామ్ సాగు పురోగతి, ఇతర ఉద్యాన పంటల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన సంచాలకులు యాస్మిన్ బాషా పాల్గొన్నారు.
హైదరాబాదులో ఎందుకు ఉంటున్నారు?
అధికారులు హైదరాబాదులో తిష్ట వేయడంపై మంత్రి తుమ్మల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమిషనరేట్ అధికారులు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని, జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు కేటాయించాలని సూచించారు. ప్రధాన కార్యాలయంలోని జాయింట్ డైరెక్టర్లకు ఒక్కొక్కరికి ఐదు జిల్లాలను కేటాయించి, వారంలో మూడు రోజులు ఆయా జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పురోగతి చాలా మందకొడిగా సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారీగా పురోగతిని సమీక్షించాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. రైతులకు ఆయిల్ పామ్ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.
డిసెంబరు నాటికి సాగు లక్ష్యాన్ని చేరాలి…
ఇప్పటికే నాటిన ఆయిల్ పామ్ తోటల రైతులకు పంట యాజమాన్యం విషయంలో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల తెలిపారు. తద్వారా అనుకున్న సమయానికి ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం డిసెంబరు నెలాఖరు నాటికి ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, తదనుగుణంగా వారంవారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
టార్గెట్ 1.25 లక్షలు… 6,750 ఎకరాల్లో పూర్తి
2025-26 సంవత్సరానికి 1.25 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ నాటుటకు నమోదు చేసుకున్నారన్నారు. అందులో 26 వేల ఎకరాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఈ జూన్ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తయిందని డైరెక్టర్ వివరించారు. 2024-25 సంవత్సరంలో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులకు చెందిన 40,247 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టడం జరిగిందని తెలిపారు. 2021-22 సంవత్సరంలో కొత్త జిల్లాలలో సాగులోకి తీసుకొచ్చిన ఆయిల్ పామ్ తోటలు కాపునకు వచ్చాయని, ఆయా కంపెనీలు రైతుల నుండి ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణానికి అనుగుణంగా కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.