‘కాంపౌండర్ల వైద్యంతో కాటికే’ – నకిలీ వైద్యులతో ప్రాణాలు హరి

  • షాబాద్‌లో మెడికల్ కౌన్సిల్ దాడులు
  • ఫస్ట్ ఎయిడ్ ముసుగులో అక్రమ వైద్యం…
  • అల్లోపతి దవాఖానాలు నెలకొల్పి దందా

సహనం వందే, రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా షాబాద్, హైతాబాద్ ప్రాంతాల్లో డాక్టర్లుగా చెలామణి అవుతున్న కాంపౌండర్లు, నకిలీ వైద్యుల గుట్టు రట్టైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం నిర్వహించిన తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ ఎయిడ్ బోర్డులు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి దవాఖానాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. కాంపౌండర్ గా పనిచేసి పెద్ద డాక్టర్లుగా చెప్పుకుంటున్నట్లు తెలిసింది. నకిలీ డాక్టర్లకు గుట్టు తెలియక అమాయక ప్రజలు మోసపోతున్నట్టు మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. కాంపౌండర్లు చేస్తున్న వైద్యం వల్ల అనేక మంది రోగులు చనిపోతున్నారని మెడికల్ కౌన్సిల్ అభిప్రాయపడుతుంది. ‘కాంపౌండర్ల వైద్యంతో కాటికే’ అని ఒక ప్రభుత్వ వైద్యుడు వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది.

నకిలీ వైద్యుల అక్రమ దందా
తనిఖీలలో భాగంగా ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో లింగాచారి, శ్రావణ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో బాలరాజు, మధుశ్రీ క్లినిక్ పేరుతో బీఎస్సీ నర్సింగ్ చేసిన భాగ్యశ్రీ, ముస్తఫా క్లినిక్ పేరుతో ముస్తఫా, మాస్టర్ క్లినిక్ పేరుతో వెంకటేష్, శ్రీ సాయి క్లినిక్ పేరుతో అంజయ్య, జంజం క్లినిక్ పేరుతో మహమ్మద్ గౌస్ అంజద్ అనే వ్యక్తులు అనధికారికంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. వీరి వద్ద వందల సంఖ్యలో డైక్లోఫెనాక్ సోడియం, కాల్షియం గ్లూకోనేట్, స్టెరాయిడ్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు గుర్తించారు. కనీస వైద్య విద్యార్హతలు లేని ఈ వ్యక్తులందరూ గుడ్డిగా ఆధునిక వైద్యం చేస్తున్నట్లు తేలింది. కొద్దిరోజులు ఆసుపత్రులలో కాంపౌండర్లుగా పనిచేసిన వీరు, ఇప్పుడు వైద్యులమని చెప్పుకుంటూ అల్లోపతి దవాఖానాలు నిర్వహిస్తూ అల్లోపతి మందులు రాస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా వీరు రోగంతో నిమిత్తం లేకుండా అధిక మోతాదులో యాంటీబయాటిక్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు మరియు టాబ్లెట్లు ప్రజలకు ఇస్తున్నారని అధికారులు తెలిపారు.

ఫస్ట్ ఎయిడ్ ముసుగులో అక్రమ వైద్యం…
ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది ప్రాథమిక చికిత్స కేంద్రం మాత్రమేనని, దీని పేరుతో లైసెన్స్ లేకుండా అల్లోపతి క్లినిక్ నెలకొల్పి అర్హత లేకున్నా పరిమితి లోపు అల్లోపతి వైద్యం చేయవచ్చని ఏ చట్టంలోనూ ఎలాంటి నియమాలు లేవని డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పరిధిలోపు అల్లోపతి వైద్యం ఊహాజనితమైనది, కల్పితం మాత్రమేనని… వాస్తవం కాదని ఆయన అన్నారు.

నకిలీ వైద్యులపై కఠిన చర్యలు…
ఎన్‌ఎంసీ చట్టం ప్రకారం ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించి, మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే అల్లోపతి వైద్యులు, మెడికల్ ప్రాక్టీషనర్లు అని డాక్టర్ శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇది పట్టభద్రులకు గల ప్రత్యేక హక్కు అని, మిగతా వారెవరైనా అనర్హులని ఆయన నొక్కిచెప్పారు. వైద్య విద్యను అభ్యసించకుండా, పరీక్షలు పాస్ అవ్వకుండా, మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, కేవలం కొన్ని గంటలు ప్రథమ చికిత్స ట్రైనింగ్ తీసుకొని, గ్రామీణ వైద్యుల సంఘాలు లేదా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సంఘాల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారు అల్లోపతి వైద్యులుగా అర్హత పొందినట్టు కాదని వివరించారు.

మెడికల్ స్టోర్స్‌పై నిఘా…
నకిలీ వైద్యుల క్లినిక్‌లకు అనుబంధంగా ఉన్న మెడికల్ స్టోర్స్‌లో సైతం క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్‌లు లేకుండా యాంటీబయాటిక్, స్టెరాయిడ్, ఇతర షెడ్యూల్ హెచ్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లపై డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *