- చేతులు వణకడం… నడకలో సమస్యలు
- భారత, అమెరికాల్లో ప్రాణాంతకంగా మందు
- ఆత్మహత్యకు ఉపయోగిస్తున్న అన్నదాతలు
- తెలంగాణలోనూ విస్తృతంగా వాడకం
- చైనా, యూరప్‌లో సహా 50 దేశాల్లో నిషేధం
- అయినా ఇక్కడ అమ్మాల్సిన అవసరమేంటి?
- మన రాష్ట్రంలోనూ నిషేధించాలని డిమాండ్
సహనం వందే, హైదరాబాద్:
భారత్, అమెరికా దేశాల్లో విస్తృతంగా ఉపయోగించే ప్రమాదకరమైన పారాక్వాట్ హెర్బిసైడ్ (గడ్డి మందు) వల్ల పార్కిన్సన్స్ వ్యాధి సంభవిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైన కథనం ప్రకారం… పారాక్వాట్ వాడకం వల్ల అమెరికన్ రైతులు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదే సమస్య భారత దేశంలోనూ తీవ్రంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికాలో పారాక్వాట్ విష ప్రభావం…
పారాక్వాట్ కలుపు నివారణకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన పురుగుమందు. ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీసే దీర్ఘకాలిక వ్యాధి పార్కిన్సన్స్‌కు కారణమవుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం… అమెరికన్ రైతు డేవిడ్ జిల్బర్ట్ తన పొలంలో ఐదేళ్ల పాటు పారాక్వాట్ ఉపయోగించిన తర్వాత చేతులు వణకడం, నడకలో సమస్యలు వంటి లక్షణాలతో బాధపడ్డారు. చివరికి ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికాలో ఇలాంటి అనేక ఉదాహరణలు వెలుగులోకి రావడంతో దీని వాడకంపై నిషేధం విధించాలని ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా కొన్ని ఆంక్షలు విధించినా పూర్తిగా నిషేధించలేదు. అయితే చైనా, యూరోపియన్ యూనియన్‌తో సహా 50కి పైగా దేశాలు పారాక్వాట్‌ను ఇప్పటికే నిషేధించాయి.
తెలంగాణ, ఆంధ్రలో విపరీతంగా వాడకం…
భారతదేశంలో పారాక్వాట్ డైక్లోరైడ్ పేరుతో ఈ మందు పత్తి, వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు వంటి వివిధ వ్యవసాయ పంటలపై కలుపు నివారణకు విరివిగా ఉపయోగిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనిని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఆర్‌సీ) ద్వారా నియంత్రిస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఇది చట్టబద్ధంగా అనుమతించిన పురుగుమందుల జాబితాలోనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాలలో రైతులు తక్కువ ధర, అధిక సామర్థ్యం కారణంగా పారాక్వాట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
రక్షణ గ్లవ్స్, మాస్క్‌లు వాడని రైతులు…
పారాక్వాట్ ఒక చిన్న చుక్క పొరపాటున తాగినా ప్రాణాంతకం. చర్మం లేదా శ్వాస ద్వారా శరీరంలోకి వెళితే అది నాడీ వ్యవస్థను దెబ్బతీసి దీర్ఘకాలికంగా పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. భారత రైతులు గ్లవ్స్, మాస్క్‌లు, ఇతర రక్షణ చర్యలు తీసుకోరు. దీంతో వారు ఈ రసాయనానికి నేరుగా గురై తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ గడ్డి మందు తీసుకొని దేశంలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి విరుగుడు మందు లేకపోవడం వల్ల 50% నుంచి 90% వరకు రోగులు మృత్యువాత పడుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని వినతులు…
పారాక్వాట్ హెర్బిసైడ్ (గడ్డి మందు)పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌డీఏ), డాక్టర్స్ అగైన్స్ట్ పెరాక్విడ్ పాయిజన్ (డీఏపీపీ) డిమాండ్ చేస్తున్నాయి. పారాక్వాట్ ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై తక్షణ నిషేధం విధించాలని, మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను వెనక్కి తీసుకొని సురక్షితంగా నిర్వీర్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.