- ప్రతిపక్షాల ఒత్తిడితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం
- మరాఠీ భాష మాత్రమే కీలకమని స్పష్టీకరణ
సహనం వందే, ముంబై:
బాలీవుడ్ కు కేంద్ర బిందువైన మహారాష్ట్రలో హిందీ భాషకు ఎదురుగాలి వీస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానంపై ఇంతకాలం కొనసాగిన వివాదాలకు తెరదించుతూ వివాదాస్పదమైన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానాన్ని తిరిగి సమీక్షించి అమలు చేయడానికి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన మహా సర్కార్…
మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడో భాషగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ‘త్రిభాషా విధానంపై గతంలో జారీ చేసిన రెండు జీవోలను రద్దు చేస్తున్నాం. ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ అన్ని వర్గాలతో చర్చించి, నివేదిక సమర్పించిన తర్వాతే త్రిభాషా విధానంపై తుది నిర్ణయం తీసుకుంటాం. మా ప్రధాన లక్ష్యం మరాఠీ భాషకు ప్రాధాన్యత ఇవ్వడమేన’ని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
వివాదం ఎక్కడ మొదలైందంటే?
మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్‌లో జారీ చేసిన జీవో ప్రకారం… మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి మూడో భాషగా చేయాలని నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా దశలవారీగా అమలు చేయాలని భావించారు. అయితే ఈ నిర్ణయం మహారాష్ట్రలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వర్గాల నుంచి తీవ్ర నిరసనలకు దారితీసింది.
హిందీ తప్పనిసరి కాదంటూ స్పష్టత…
ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఫడ్నవీస్ తన పట్టు సడలించి హిందీని తప్పనిసరి చేయబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషలను కూడా మూడో భాషగా ఎంచుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేనలు హిందీ రుద్దడంపై తీవ్ర నిరసనలకు దిగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భాషా వైవిధ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా అభివర్ణించిన ఈ పార్టీలు, ముంబైలో సంయుక్తంగా ఒక నిరసన ప్రదర్శన కూడా నిర్వహించాయి.