- రవాణా శాఖ ఆధ్వర్యంలో రక్షణ కరువు
- వీటికి ప్రత్యేక నెంబర్ ప్లేట్లు ఉండవు
- నిషేధం విధించాలన్న డిమాండ్లు
- కర్నాటక బాటలో తెలంగాణ సర్కార్
సహనం వందే, హైదరాబాద్: కర్నాటకలో బైక్ ట్యాక్సీ లపై విధించిన నిషేధం ఇప్పుడు హైదరాబాద్‌కూ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ వీటిని నిషేధించాలంటూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ రవాణా శాఖను డిమాండ్ చేస్తోంది. త్వరలో ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ నిషేధం అమలైతే, హైదరాబాద్ రోడ్లపైనా బైక్ ట్యాక్సీలు కనుమరుగు కానున్నాయి.
వ్యక్తిగత బైక్‌లతో భద్రత ఎలా?
హైదరాబాద్‌లో సుమారు 70 వేల బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయని అంచనా. ప్రయాణికులకు ఇవి సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. వ్యక్తిగతఘ అవసరాల కోసం కొనుగోలు చేసిన బైక్‌లకు తెల్ల నంబర్ ప్లేట్ మాత్రమే ఉంటుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాహనాలకు పసుపు నంబర్ ప్లేట్ తప్పనిసరి. వ్యక్తిగత బైక్‌లను రవాణా కోసం వాడటం చట్టవిరుద్ధమని గిగ్ వర్కర్స్ యూనియన్ నేతలు వాదిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోవడం ఒకటైతే… ఆటోలు, ఇతర ట్యాక్సీలకు గిరాకీ తగ్గి వారి జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నాటకలో బైక్ ట్యాక్సీల బ్యాన్ నేపథ్యం…
కర్నాటకలో బైక్ ట్యాక్సీల సంఖ్య పెరగడంతో ఆటో, కార్ ట్యాక్సీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ప్రభుత్వాన్ని ఆశ్రయించగా బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో జూన్ 16 నుంచి కర్నాటకలో బైక్ ట్యాక్సీలు పూర్తిగా నిషేధించారు. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొనడంతో ఆటో, కార్ ట్యాక్సీ యూనియన్లు నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.
బైక్ ట్యాక్సీల వల్ల ఇబ్బందులు…
బైక్ ట్యాక్సీల వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని… ముఖ్యంగా ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు ఇది విఘాతం కలిగిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం, బీమా భద్రత లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి కంపెనీలు కాంట్రాక్టు పద్ధతిలో బైక్ ట్యాక్సీలను నడుపుతున్నాయి. ఈ కంపెనీలు డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరి నుంచి లాభాలు దండుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. బైక్ ట్యాక్సీలను నియంత్రించే వరకు వాటిని నిషేధించాలనే డిమాండ్ ముందుకొచ్చింది.
నిషేధిస్తే ప్రయాణికులకు నష్టమేనా?
బైక్ ట్యాక్సీల వల్ల సామాన్యులకు ప్రయోజనం చేకూరుతోంది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలోనూ ఇవి కొంతవరకు ఉపయోగపడుతున్నాయి. అలాగే బైక్ నడిపే యువతకు ఇదొక ఉపాధి మార్గంగా మారింది. బెంగళూరులో బైక్ ట్యాక్సీలను నిషేధించిన తర్వాత ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందని, లక్ష మందికి పైగా బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి నిరసనలు తెలుపుతున్నారని సమాచారం. హైదరాబాద్‌లోనూ బైక్ ట్యాక్సీలు రద్దైతే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది కాబట్టి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.