- దాంతోనే బాగా పనిచేశామన్న ఫీలింగ్
- అభివృద్ధికి అడ్డంకిగా సీనియర్ ఐఏఎస్ అధికారులు
- రాజస్థాన్ అధికారి అజితాబ్ సంచలనం
- రిపోర్టుల్లోనే కాలక్షేపం… అసలు పనికి దూరం
- సమావేశాలతోనే సరి… పని సమయం వృధా
- ఆత్మ పరిశీలన అవసరం… సీనియర్ ఐఏఎస్ అజితాబ్ సూచన
సహనం వందే, హైదరాబాద్: ఆయన తెలంగాణలో కీలకమైన హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన చేతిలో అత్యంత కీలక శాఖ ఉంది. కానీ ఆ సీనియర్ అధికారి మాత్రం రొటీన్ మీటింగ్స్, రిపోర్ట్స్ తదితర పనుల వైపే మొగ్గు చూపుతుంటారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెట్టడం ద్వారానే పని చేయించాలన్న దృక్పథంతో ఉంటారు. దానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో ఎంతో బిజీగా కనిపిస్తారు. కానీ కీలకమైన పనులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక కీలకమైన పథకాన్ని అమలు చేయడంలో విఫలం అయ్యారనే విమర్శలున్నాయి.
ఇతను మరో సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన చేతిలో కూడా ముఖ్యమైన శాఖ ఉంది. ఆయన ఎంతో బిజీగా ఉంటారు. ఎవరైనా ఫోన్ చేస్తే వాష్ రూమ్ లో ఉన్నానంటారు. తర్వాత ఫోన్ చేస్తే కారులో టిఫిన్ చేస్తున్నానంటారు. ఇంట్లో టిఫిన్ చేయక కొన్నేళ్ళు అయిందంటారు. అంత ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారి ఒక కీలకమైనటువంటి అంశంలో సరిగా వ్యవహరించలేక సమస్యలు కొనితెచ్చుకున్నారు.

ఆయన పేరు సురేష్ చందా… రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన ఉదయం 10:30 గంటలకు ఆఫీసుకు వచ్చేవారు. సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకు ఇంటికి వెళ్లి పోయేవారు. అన్ని ఫైల్స్, పనులూ చక్కదిద్దేవారు. మిగతావాళ్లు రాత్రి వరకు పని చేస్తుంటే మీరు ఏంటి ఇలా అడిగితే, ‘ఎన్ని బాధ్యతలు మోస్తున్నప్పటికీ ఆఫీస్ టైంలోనే అన్ని పనులూ చేయగలం. కానీ కొందరు ఎందుకు ఎక్కువ టైం ఉంటారో తెలియద’ని వ్యాఖ్యానించారు. ‘వారికి కోర్ పనులను… నాన్ కోర్ పనులను ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలో తెలియకపోవచ్చు’ అని చురక అంటించారు. ఆయన తన చాంబర్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించుకున్నారు. ఏదీ సీక్రెట్ కాదని… అంతా పారదర్శకమేనని ఆయన భావన.
భారత పరిపాలనా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్ అధికారులు తమ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారనే అంశంపై రాజస్థాన్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అజితాబ్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఐఏఎస్ అధికారులు తమ మొత్తం పని సమయంలో 80 శాతం వృత్తికి సంబంధం లేని (నాన్-కోర్) పనులకే కేటాయిస్తున్నారని, కేవలం 20 శాతం మాత్రమే తమ ముఖ్య బాధ్యతలకు (కోర్) సమయం ఇస్తున్నారని ఆయన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ పరిపాలనా వ్యవస్థలో పాతుకుపోయిన లోపాలను బహిర్గతం చేయడమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
నాన్-కోర్ పనుల భారం…
అజితాబ్ శర్మ విశ్లేషణ ప్రకారం… ఐఏఎస్ అధికారుల దినచర్యలో అధిక భాగం సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు, చట్టపరమైన విషయాలు, సమాచార హక్కు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వార్తా పత్రికల క్లిప్పింగ్‌లకు స్పందించడం, నివేదికలు తయారు చేయడం, సాధారణ కరస్పాండెన్స్‌ను నిర్వహించడం వంటి రొటీన్ పనులకే పరిమితమైపోతుంది. ఈ పనులు కార్యాలయ నిర్వహణకు అవసరమైనవే అయినప్పటికీ, శాఖల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడే కోర్ పనులకు అవి తీవ్ర ఆటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్, నాన్ కోర్ పనుల గందరగోళం…
అధికారికి కేటాయించిన ప్రధాన బాధ్యతలు లేదా ముఖ్యమైన విధులకు సంబంధం లేని పనులనే నాన్-కోర్ పనులుగా నిర్వచిస్తారు. ఇవి కార్యాలయానికి అవసరమైనవే అయినా, అధికారి ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి నేరుగా సాయపడవు. ఈ నాన్-కోర్ పనుల సుడిగుండంలో చిక్కుకుపోయిన అధికారులు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని శర్మ అభిప్రాయపడ్డారు. దశాబ్దాలపాటు ఈ రొటీన్ పనులు చేస్తూ, తమను తాము నిపుణులైన పరిపాలనాధికారులుగా భావించడం కేవలం ఒక భ్రమ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వ్యవస్థాగతమైన లోపాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి.
కోర్ పనులే నిజమైన సవాల్…
ప్రతి శాఖకు సంబంధించిన కోర్ పనులు ప్రత్యేకమైనవని… వాటిని ప్రాధాన్యంగా చేపట్టడం ద్వారానే అధికారులు నిజమైన మార్పును తీసుకురాగలరని అజితాబ్ శర్మ నొక్కి చెప్పారు. ఉదాహరణకు నీటి సరఫరా, ఇంధనం, పరిశ్రమలు, గ్రామీణ పట్టణాభివృద్ధి, రోడ్లు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ఆయా శాఖల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కోర్ పనులు ఉంటాయని ఆయన వివరించారు. వీటిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. శర్మ ఇటీవల రాజస్థాన్ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత తన పని విధానాన్ని సమూలంగా మార్చుకుని శాఖకు సంబంధించిన కోర్ పనులపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

నాయకత్వ లక్షణానికి శర్మ నిదర్శనం…
అజితాబ్ శర్మ లింక్డ్‌ఇన్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చను రేకెత్తించింది. కేవలం బిజీగా ఉండటం కంటే, అవసరమైన పనులను చేయడం మధ్య తేడా ఉందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరొకరు శర్మ రాజస్థాన్‌లో ‘రైజింగ్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇప్పుడు ఇంధన శాఖను కూడా సమూలంగా మారుస్తారని అభిప్రాయపడ్డారు. కోర్, నాన్-కోర్ పనుల మధ్య తేడాను గుర్తించి, కోర్ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం దీర్ఘకాలిక పరిపాలనా సంస్కరణలకు అత్యవసరం అని మరొకరు వ్యాఖ్యలో పేర్కొన్నారు.
శర్మ వ్యాఖ్యల ప్రాముఖ్యత…
అజితాబ్ శర్మ వ్యాఖ్యలు భారత పరిపాలనా వ్యవస్థలోని కీలక సమస్యను వెలుగులోకి తెచ్చాయి. ఐఏఎస్ అధికారులు నాన్-కోర్ పనుల ఒత్తిడిలో కోర్ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల శాఖల పురోగతి ఆగిపోతుందని, ఇది దీర్ఘకాలంలో సేవల నాణ్యతను దెబ్బతీస్తుందని శర్మ హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిపాలనా వ్యవస్థలో స్పష్టమైన పని విభజన, టాస్క్ డెలిగేషన్, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా నాన్-కోర్ పనుల భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.