‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

  • 50 ఏళ్లలోనూ 30 ఏళ్లలా కనిపించే రహస్యం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమూ!

సహనం వందే, ముంబై:
బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు.

‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని అంటున్నారు. కానీ నాకు అలాంటి ఖరీదైన సాంకేతికతను ఉపయోగించే బడ్జెట్ లేద’ని చెప్పాడు. తన యవ్వన రూపం వెనుక ఎలాంటి అధునాతనమైన పద్ధతులు లేవని, కేవలం సహజమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని స్పష్టం చేశాడు.

బరువు తగ్గించిన రహస్యం…
మాధవన్ తన బరువు తగ్గింపు ప్రయాణం గురించి మాట్లాడుతూ… 2016లో సాలా ఖడూస్ సినిమా సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించాడు. ‘నేను అనేక మంది ఆహార నిపుణులను సంప్రదించాను. వివిధ ఆహార పద్ధతులను అనుసరించాను. కానీ ఏదీ సరిగ్గా పని చేయలేద’ని అన్నాడు. చివరకు ఒక సాంప్రదాయ ఫిట్‌నెస్ నిపుణుడు ఇచ్చిన సలహా అతని జీవితాన్ని మార్చేసింది.

‘ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తిను’ ఈ సరళమైన సూత్రం మాధవన్‌కు అద్భుత ఫలితాలనిచ్చింది. నిర్ణీత భోజన సమయాలను పాటించడం మానేసి, శరీరం ఆకలి సంకేతం ఇచ్చినప్పుడు మాత్రమే తినడం ద్వారా అతను సహజంగా బరువు తగ్గాడు. ‘ఈ విధానం నా శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచింది. ఇది ఎలాంటి విభిన్నమైన ఆహార ప్రణాళిక కాదు. కేవలం శరీర సంకేతాలను గౌరవించడమే’ అని మాధవన్ వివరించాడు. ఆకలి లేనప్పుడు తినకపోవడం, అతిగా తినడం మానుకోవడం. సంక్లిష్టమైన ఆహార ప్రణాళికలకు బదులు సహజమైన, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం. మానసిక ఆరోగ్యం కూడా చాలా కీలకం అని మాధవన్ నమ్ముతాడు. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం కూడా అతని దినచర్యలో భాగం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *