- ఎలాన్ మస్క్ – ది రియల్ ఇన్‌స్పిరేషన్!
- వస్తువుల కంటే విజయం ముఖ్యమనే భావన
- 35 లక్షల కోట్లున్నా… సాదాసీదా జీవితం
- 375 చదరపు అడుగుల ఇంట్లో నివాసం
సహనం వందే, అమెరికా:
ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్) వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవనశైలి ఎందరికో ఆదర్శం. రూ. 35 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నప్పటికీ… ఆయన విలాసవంతమైన జీవితానికి దూరంగా, అత్యంత సాధారణంగా జీవించడం విశేషం. సంపదను వ్యక్తిగత విలాసాలకు కాకుండా, మానవాళి భవిష్యత్తును మెరుగుపరచే తన వెంచర్ల అభివృద్ధికి వినియోగించడమే మస్క్ ప్రధాన లక్ష్యం. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
వస్తువులు మనిషికి బరువు…
సాధారణంగా బిలియనీర్లు విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన ఆహారం, లగ్జరీ కార్లతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ మస్క్ అందుకు పూర్తి భిన్నం. ఆయన దృష్టి అంతా తన కంపెనీలైన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల ద్వారా మానవాళికి మంచి భవిష్యత్తును అందించడంపైనే ఉంది. వస్తువులు మనిషికి బరువుగా మారతాయని, దాడి చేసే సాధనంలా ఉంటాయని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే చాలా తక్కువ, సాధారణ వస్తువులతో నిరాడంబరంగా జీవించడానికి మొగ్గు చూపుతారు.
ఏడు ఇళ్లు అమ్మి… చిన్న ఇంటికి మారి
2020-21 మధ్యకాలంలో మస్క్ కాలిఫోర్నియాలోని తన ఏడు ఇళ్లను 100 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఆ తర్వాత టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ సైట్ సమీపంలో కేవలం 375 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ఇంట్లోకి మారారు. దీని విలువ కేవలం 50 వేల డాలర్లు మాత్రమే. ఒకానొక దశలో ‘నేను దాదాపు అన్ని వస్తువులను అమ్ముతున్నాను. నాకు ఇల్లు ఉండద’ని ఆయన ట్వీట్ చేశారు. ఇది ఎంతటి నిరాడంబరత్వానికి నిదర్శనమో తెలియజేస్తుంది. సాధారణ పౌరులు తమ జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకోవాలని లేదా కొనుగోలు చేయాలని ఆకాంక్షిస్తే, మస్క్ మాత్రం సంపద సృష్టిపై, భవిష్యత్ ఆవిష్కరణలపైనే దృష్టి సారించారు.
పేదరికం నుంచి కుబేర స్థాయికి…
మస్క్ చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించారు. ఒక డాలర్‌తో రోజు గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. తన దగ్గర ఉన్న డబ్బంతా వ్యాపారానికే ఖర్చు చేసేవారట. ఖరీదైన ఆహారంపై ఆయనకు ఆసక్తి లేదు. అలాగే ఫర్నిచర్ విషయంలోనూ ఆయన చాలా సాధారణంగా ఉంటారు. తన మాజీ భాగస్వామి గ్రిమ్స్ చెప్పినట్లు… మస్క్ పరుపు డ్యామేజ్ అయినా కొత్తది కొనకుండా బాగుచేయించుకోవడానికే ఇష్టపడతారు. లగ్జరీ కార్ల పట్ల కూడా ఆయనకు వ్యామోహం లేదు. గతంలో మిలియన్ డాలర్ల విలువైన మెక్‌లారెన్ ఎఫ్1 కారును కొన్నా, అది ప్రమాదానికి గురైన తర్వాత దాని స్థానంలో మరో సూపర్‌కార్ కొనలేదు. ప్రస్తుతం ఎక్కువగా టెస్లా కార్లనే ఉపయోగిస్తున్నారు.
స్నేహితుల ఇళ్లలో బస…
ఒకప్పుడు సొంత స్థలం కూడా లేకుండా స్నేహితుల ఇళ్లలో బస చేసినట్లు మస్క్ స్వయంగా తెలిపారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కూడా మస్క్‌కు ఆశ్రయం ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ అలవాట్లన్నీ ఎలాన్ మస్క్ తన సంపదనంతా తన కంపెనీల అభివృద్ధికి, మానవజాతి ప్రగతికి ఉపయోగించాలని తపన పడుతున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. వ్యక్తిగత అవసరాలకు పెద్దగా ఖర్చు చేయకుండా, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనే అపరిమిత లక్ష్యాలతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఎలాన్ మస్క్ నిరాడంబర జీవనం, ఆశయాల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.