- ఈనెల 30వ తేదీ నుంచి నిరవధిక సమ్మె
- డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వల్లే
- ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులంతా సమ్మెలోనే
- దీంతో అన్ని మెడికల్ కాలేజీల్లో ఎఫెక్ట్
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని… దానికి వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో విధులు బహిష్కరిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (టీ-జూడా) అధ్యక్షులు డాక్టర్ ఐజాక్ న్యూటన్, నాయకులు డాక్టర్ ఎ.గిరిప్రసాద్, డాక్టర్ యు.సాయికృష్ణ, డాక్టర్ వి. జితిన్, డాక్టర్ బి. హేమంత్ శుక్రవారం వెల్లడించారు. పెండింగ్ స్టైపెండ్, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరతపై ప్రభుత్వంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ నుండి పదేపదే విజ్ఞప్తులు చేసినా… వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అనేక సమావేశాలు నిర్వహించినా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
మానసిక, శారీరక ఒత్తిడిలో జూనియర్ డాక్టర్లు…
ఈ సందర్భంగా డాక్టర్ ఐజాక్ న్యూటన్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు వెన్నెముకగా నిలిచే జూనియర్ డాక్టర్లు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడితో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరచుగా 36 గంటలకుపైగా విరామం లేకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి సకాలంలో స్టైపెండ్, మౌలిక సదుపాయాలు, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రోగి సంరక్షణ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు అందరూ ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన తేల్చి చెప్పారు.
జూడాల డిమాండ్లు…
- పోస్ట్ గ్రాడ్యుయేట్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లకు స్టైపెండ్ ఆలస్యమవుతూనే ఉన్నాయి. స్టైపెండ్ ను సకాలంలో విడుదల చేయాలి. అందుకోసం గ్రీన్ ఛానల్ అమలు చేయాలి. ఈ విధానం ద్వారా ప్రతి నెలా 10వ తేదీలోపు స్టైపెండ్ విడుదల చేయాలి.
- స్టైపెండ్ పెంపును వెంటనే అమలుపరచాలి. ఈ ఏడాది జనవరి నుండి అమలులోకి రావాల్సిన సవరించిన స్టైపెండ్ ఇప్పటికీ అమలు కాలేదు. ఆ ప్రకారం వెంటనే అమలు చేసి, జనవరి నుండి అన్ని బకాయిలను పంపిణీ చేయాలి.
- అనేక మెడికల్ కాలేజీలలో ఇప్పటికీ ప్రాథమిక సౌకర్యాలు లేవు. నాగర్‌కర్నూల్, సిద్దిపేట వంటి చోట్ల అసంపూర్తిగా భవనాలు ఉన్నాయి. నీటి కొరత, సరైన రవాణా లేదు. నిజామాబాద్‌లో 12 సంవత్సరాలుగా ఆట స్థలం లేదు. మౌలిక సదుపాయాల సమీక్ష కమిటీలలో విద్యార్థి ప్రతినిధులను చేర్చాలి. రవాణా, నీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
- క్లినికల్, పారా-క్లినికల్ అధ్యాపకుల కొరత విద్యా నాణ్యతను దెబ్బతీస్తోంది. జాతీయ వైద్య మండలి (ఎన్.ఎం.సి) నిబంధనలకు అనుగుణంగా రెగ్యులర్, వార్షిక నియామక క్యాలెండర్‌ను ప్రకటించి తక్షణ నియామకాలను చేపట్టాలి.
- ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో స్టైపెండ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రైవేట్ సంస్థలలో స్టైపెండ్ నిబంధనల ఉల్లంఘనలను ఆపాలి. వాటిల్లో ఇంటర్న్‌లు, పీజీలకు స్టైపెండ్ చెల్లింపులో నిబంధనలను నిర్ధారించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి.
- మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఆలస్యమవుతున్నాయి. పాక్షికంగా పంపిణీ చేయడమో లేదా నిలిపివేయడమో జరుగుతుంది. దీనివల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్లు పెండింగ్‌లో ఉన్నందున విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తిరిగి పొందడానికి సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా తమ విద్యా రుసుములను పూర్తిగా తిరిగి పొందలేదు. ఈ సమస్యను పరిష్కరించాలి.