- భర్తను బెదిరించిన భార్య…
- భర్తను కుమారుడిని వదిలేసి ప్రియుడితో వెళ్లేందుకు స్కెచ్
- పబ్‌జీ గేమ్ కు బానిసై… ఇంట్లోనే గంటల తరబడి ఆడుతూ గడిపిన యువతి
సహనం వందే, ఉత్తరప్రదేశ్:
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం హైదరాబాదులో కన్నతల్లిని చంపిన పదో తరగతి కూతురి వ్యవహారాన్ని మరిచిపోక ముందే… పబ్‌జీ ద్వారా ప్రేమలో పడి భర్తను, ఏడాదిన్నర కొడుకును వదిలేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సోషల్ మీడియా మనుషుల మధ్య బంధాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి తాజా ఘటనలు నిదర్శనం. ఒక పబ్‌జీ ప్రేమ వ్యవహారం ఓ వివాహ బంధాన్ని తలకిందులు చేయడమే కాకుండా, హత్య బెదిరింపుల వరకు దారితీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో కలకలం సృష్టిస్తోంది.

వెయ్యి కిలోమీటర్ల ప్రేమ ఉన్మాదం…
మహోబాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022 లో శీలు అనే యువకుడిని వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర వయసున్న ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవలి కాలంలో ఆరాధన పబ్‌జీ గేమ్‌కు బానిసై, ఇంట్లోనే గంటల తరబడి ఆడుతూ ఉండేది. ఈ క్రమంలో లుధియానాకు చెందిన శివమ్ అనే యువకుడితో పబ్‌జీలో పరిచయం ఏర్పడింది. ఆటలో మొదలైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తన భర్త తనను కొడుతున్నాడని శివమ్‌కు ఆరాధన తరచుగా చెబుతూ ఉండేదట. ఈ మాటలు విని చలించిపోయిన శివమ్, ఆమెను కలుసుకోవడానికి పంజాబ్ నుంచి మహోబా వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఆరాధన ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఊహించని రీతిలో వచ్చిన శివమ్‌ను చూసి ఆమె భర్తతోపాటు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
మీరట్ మర్డర్ తరహాలో బెదిరింపులు…
ఈ ప్రేమ కథలో అత్యంత దిగ్భ్రాంతికరమైన మలుపు ఏంటంటే… తమ ప్రేమకు భర్త శీలు అడ్డుగా ఉన్నాడని భావించిన ఆరాధన, అతడిని దారుణంగా బెదిరించింది. ‘మీరట్ మర్డర్’ తరహాలో 55 ముక్కలుగా నరుకుతానంటూ భర్తను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన శీలు… వెంటనే శివమ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. శివమ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, ఆరాధన కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తన భర్త తాగుబోతు అని… తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ శివమ్‌తోనే వెళ్లిపోతానని వాదించింది. పోలీసులు కేసు నమోదు చేసి శివమ్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.