- పనుల పురోగతిపై తుమ్మల సమీక్ష
- రిఫైనరీ, ప్యాకింగ్ యూనిట్ నిర్మాణ టెండర్లకు ఆదేశం
సహనం వందే, సిద్దిపేట:
తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పామాయిల్ సాగు, నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రుల బృందం కొహెడ మండలం సముద్రాల గ్రామంలోని కోమురరెడ్డి పామాయిల్ తోటను సందర్శించి సాగు చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. కర్మాగారంలో ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, ఆగస్టు మొదటి వారం నాటికి మొత్తం కర్మాగారం నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాలలో ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అందుబాటులోకి రావాల్సిన అవశ్యకతను నొక్కిచెప్పిన తుమ్మల… రిఫైనరీ, ప్యాకింగ్ యూనిట్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు.