హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీలపై నిషేధం
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలోని దంతవైద్యులకు (డెంటిస్టులకు) తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) ఒక పెద్ద షాకిచ్చింది. ఇకపై దంతవైద్యులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని టీఎంసీ స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) మార్గదర్శకాల ఆధారంగా టీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జరీలకే పరిమితం
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నిబంధనల ప్రకారం బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) లేదా మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) డిగ్రీ కలిగిన దంతవైద్యులు కేవలం ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జరీలకు మాత్రమే అర్హులని టీఎంసీ పేర్కొంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీఎంసీ హెచ్చరించింది. ఇటీవల కొందరు దంతవైద్యులు అర్హత లేకుండా ఈ ప్రొసీజర్‌లు చేస్తున్నట్లు భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎంసీ వెల్లడించింది. ప్రజలు ఇటువంటి చికిత్సల కోసం ఎంబీబీఎస్, ఎంఎస్ లేదా ఎండీ స్పెషలైజేషన్ కలిగిన వైద్యులను సంప్రదించాలని మెడికల్ కౌన్సిల్ సూచించింది.