- బాయ్ ఫ్రెండ్ తో కలిసి కిరాతకం
- హైదరాబాద్ శివారు జీడిమెట్లలో దారుణం
- తల్లి హత్య పై చిన్న కూతురు వాంగ్మూలం
- సమాజం ఎటు పోతుందోనన్న ఆందోళన
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అయితే ఈ దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మృతురాలి చిన్న కుమార్తె ప్రియ… ఈ వ్యవహారంలో వెలుగులోకి తెచ్చిన నిజాలు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
‘బయటకి పంపిన అక్క’
నిందితురాలు తేజశ్రీ చెల్లి ప్రియ మాట్లాడుతూ, తాను ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా అక్క గల్లీలోనే ఆపిందని, ‘అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది. పదా వెళ్దాం’ అంటూ తనను వెంటబెట్టుకుని వెళ్లిందని తెలిపింది. సుమారు 20 నిమిషాల తర్వాత అక్కా, తాను ఇంటికి చేరుకోగా అప్పటికే వంటగదిలో అమ్మ స్పృహ లేకుండా పడి ఉందని పేర్కొంది. ఆ సమయంలో తన అక్క ‘అమ్మను నేను చూసుకుంటా… నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకుని రా… గల్లీలో ఆంటీ వాళ్లకు ఎవరికీ చెప్పకు’ అని చెప్పిందని ప్రియ వెల్లడించింది.
‘మరణం నిర్ధారించుకున్నాకే వెళ్లిపోయారు’
‘మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకున్న అక్క... మళ్ళీ శివకు కాల్ చేసిందని… అమ్మ ఇంకా చనిపోలేదు, కాళ్లు చేతులు ఆడిస్తోంది’ అని చెప్పిందని ప్రియ వెల్లడించింది. ఆ తర్వాత మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టారని… చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారని ప్రియ సంచలన విషయాలను బయటపెట్టింది. తాను అప్పుడే లోపలికి వచ్చానని, అమ్మ రక్తపుమడుగులో పడి ఉందని చూశానని చెప్పింది. వెంటనే వెళ్లి చేతులు రుద్దానని... లేపే ప్రయత్నం చేశానని ప్రియ వివరించింది. అయితే తన అక్క మాత్రం కనీసం దగ్గరికి కూడా రాలేదని, ‘అమ్మ చనిపోయింది.. లేపి వేస్ట్’ అన్నదని ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇన్స్టాగ్రామ్ పరిచయమే ప్రాణం తీసిందా?
నిందితురాలి చెల్లెలు మరో కీలక విషయం వెల్లడించింది. నిందితురాలికి శివ అనే అబ్బాయి ఇన్ స్ట్రాగ్రాంలో 8 నెలల క్రితం పరిచయమయ్యాడని… అతడు డీజే నడిపేవాడని తెలిపింది. ‘ఫోన్లో మా ఆక్క అతడి ఫోన్ నెంబర్ కూడా శివ డీజే అని సేవ్ చేసుకుంది. అతడితో కలిసే ఇదంతా చేసింది’ అని తెలిపింది. ఈ ఘటన యావత్ సమాజంలో పరిస్థితులకు అర్థం పడుతుందా? నేటి యువత ఏ దారిలో వెళ్తున్నారు? రోజు రోజుకు పిల్లలు చేజారిపోతున్నారా? అనే ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి.