యూరియా కొరత తీర్చండి – కిషన్ రెడ్డికి తుమ్మల లేఖ

  • నెలవారీ కేటాయింపుల్లో కేంద్రం కోత…
  • రైతులకు ఇబ్బందులు తప్పవా?

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో యూరియా లభ్యతపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించేలా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ లేఖలో కోరారు. ప్రస్తుత యూరియా లభ్యత వివరాలు, అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన యూరియా పరిమాణాన్ని లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల అవసరాల కోసం కేంద్రం నుండి రాష్ట్రానికి కేటాయించిన విధంగా యూరియాను తెప్పించడంలో చొరవ తీసుకోవాలని కోరారు. రైతుల సాగు అవసరాలకు యూరియా కొరత అడ్డు కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నెలవారీ కేటాయింపుల్లో కేంద్రం కోత…
రాష్ట్రానికి నెలవారీ కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని మంత్రి తుమ్మల తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక నెలకు ముందుగానే సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం లభించడం లేదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా యూరియా కొరత కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరత సమస్యపై ఇప్పటికే పలు సందర్భాలలో లేఖల ద్వారా కేంద్ర రసాయన, ఫెర్టిలైజర్ మంత్రి జె.పి. నడ్డా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తుమ్మల ఈ లేఖలో గుర్తు చేశారు.

యూరియా కేటాయింపులు, పంపిణీ వివరాలు:

  • జూన్ నెలకు రాష్ట్రానికి 1.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా, కేవలం 67 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది.
  • ఏప్రిల్, మే నెలలకు కేటాయించిన దాని కంటే 1.21 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం తక్కువగా సరఫరా చేసింది.
  • మొత్తంగా గత మూడు నెలలకుగాను 2.25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉందని మంత్రి తుమ్మల తన లేఖలో స్పష్టం చేశారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *