ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

  • ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులు
  • జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారు
  • కోటి మొక్కల దిగుమతిలో ఆయనే కీలకపాత్ర
  • షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ విచారణ
  • గోడు వినిపించిన ఆయిల్ పామ్ రైతులు
  • బాధితులకు రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్
  • విచారణలో నీళ్లు నమిలిన అధికారులు
  • ఐఏఎస్ యాస్మిన్ బాషా, శంకరయ్య హాజరు
  • హాజరుకాలేకపోయిన రఘునందన్ రావు
  • రైతుల తరఫున ఉమామహేశ్వర్ రెడ్డి వాదన

సహనం వందే, హైదరాబాద్:
నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది. ఈ విచారణకు ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్య, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉన్నందున తాను హాజరు కాలేకపోతున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు కమిషన్ కు సమాచారం పంపించారు. ఇక ఆయిల్ పామ్ రైతుల తరఫున అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో గిరిజన రైతు శ్రీరాములు తదితరులు హాజరై తమ గోడు వినిపించారు.

జన్యులోప మొక్కలతో రైతుల ఉసురు…
ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని కలలు కన్న రైతుల ఆశలను అడియాశలు చేస్తూ, జన్యుపరంగా లోపభూయిష్టమైన మొక్కలను అధికారులు అంటగట్టారని రైతు ప్రతినిధులు కమిషన్ ముందు వివరించారు. తమ తోటల నిర్వహణలో లోపాలున్నందువల్లే ఉత్పత్తి తగ్గింది కానీ, మొక్కల నాణ్యతలో లోపం లేదంటూ అధికారులు నిందించడం విడ్డూరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని మొక్కల వల్లే తమకు తీరని నష్టం వాటిల్లిందని రైతు నేత ఉమామహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సరీల నిర్వహణ సరిగా లేకపోవడం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (ఐఐఒపిఆర్) నిర్దేశించిన ప్రమాణాలను పాటించకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, రైతులను మోసం చేయాలనే దురుద్దేశంతో చేసిన పని అని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.

నర్సరీ కుంభకోణంలో ప్రవీణ్ రెడ్డి పాత్ర…
అశ్వారావుపేట నర్సరీ కుంభకోణాలలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ రెడ్డి పాత్ర ఈ మొత్తం వ్యవహారంలో కీలకమని కమిషన్ ముందు ఆరోపించారు. ఆయిల్ ఫెడ్ డిప్యూటీ మేనేజర్‌గా ఉన్న ఆయన, 2021-24 వరకు దాదాపు కోటి మొక్కల దిగుమతిలో కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా సురేందర్ ఉన్నారు. అన్ని దేశాల విత్తన సరఫరా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న రంగనాయకులు అనే మధ్యవర్తి ప్రభుత్వ ఉన్నతాధికారులతో కుమ్మక్కై అశ్వారావుపేట నర్సరీలకు నాసిరకం మొక్కలను అందించడంలో ప్రధాన భూమిక పోషించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అంతేకాకుండా ప్రీ-యూనిక్ కంపెనీకి సాయం చేయడంలో కూడా ప్రవీణ్ రెడ్డి పాత్ర ఉందన్నారు.

ఆయిల్ ఫెడ్ వ్యవహారాల్లో ప్రీ-యూనిక్ జోక్యం
తెలంగాణలోని ఏడు జిల్లాలను ప్రీ-యూనిక్ కంపెనీకి కేటాయించారు. వాటిని వదిలేసి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీల నిర్మాణం, మరమ్మత్తు, రోజువారీ క్రషింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆశ్చర్యకరం. తనకు కేటాయించిన జోన్లలో ప్రీ-యూనిక్ ఒక్క ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా నిర్మించకపోవడంలో ఆంతర్యం ఏంటని నేతలు కమిషన్ కు వివరించారు. అదే సమయంలో ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పోటీదారు అయిన ప్రీ-యూనిక్‌ను అనుమతించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రీ-యూనిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మలేషియా సహకారంతో పనిచేస్తూ, మలేషియా నుండి విత్తన మొలకలను దిగుమతి చేసుకునేలా ఆయిల్ ఫెడ్‌ను ప్రభావితం చేసిందని ఆరోపించారు. ఆయిల్ ఫెడ్, దాని అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.

మూడు లక్షల మొక్కల్లో జన్యులోపం…
అశ్వారావుపేట, రేగళ్లపాడు నర్సరీలలో ఒక్క బ్యాచ్ మొక్కలు కూడా సరిగా లేవని, జన్యు లోపం ఉన్న ఆయిల్ పామ్ మొక్కలను కూడా రైతులపై బలవంతంగా రుద్దారని వెల్లడించారు. ప్రస్తుతం 3 లక్షల టెంబా రకం మొక్కలు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఈ నాణ్యత లేని మొక్కలన్నీ భద్రాద్రి కొత్తగూడెం నర్సరీలకు చెందిన ఆయిల్ ఫెడ్ నర్సరీల నుంచే వచ్చాయని రైతు నేతలు చెప్పారు.

కుట్రకోణం దిశగా విచారణ…
తక్కువ చమురు రికవరీ శాతాన్ని, తోటల ఉత్పత్తిని తగ్గించాలనే నేరపూరిత ఉద్దేశంతో నాసిరకం మొక్కలను సరఫరా చేయడం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని వారు వెల్లడించారు. ఇది చివరికి అశ్వారావుపేటలోని 30 టన్నుల సామర్థ్యం గల ఆయిల్ ఫెడ్ కర్మాగారాలకు, అప్పారావుపేటలోని 90 టన్నుల సామర్థ్యం గల ఆయిల్ ఫెడ్ కర్మాగారాలకు నష్టాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకోసం ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీలతో కుమ్మక్కు అయినట్లు రైతులు ఆరోపించారు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆయిల్ పామ్ గెలల సేకరణ ధరల స్థిరీకరణ ఈ రెండు కర్మాగారాల చమురు రికవరీ శాతం (ఓఈఆర్ శాతం) ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణం దిశగా దర్యాప్తు చేయాలని కోరారు.

నీళ్లు నమిలిన అధికారులు…
కమిషన్ విచారణ సందర్భంగా ఆయిల్ ఫెడ్ అధికారులు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఏదేదో చెప్పబోతుండగా… కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అడ్డుతగిలి ‘సోది చెప్పమాకు. నేను ఏమి అడిగానో నువ్వు అదే చెప్పని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా కమిషన్ ప్రశ్నలకు నీళ్లు నమ్మిలినట్టు తెలిసింది. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ… గిరిజన రైతుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. నెల రోజుల్లో అక్కడి అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

రైతుల న్యాయమైన డిమాండ్లు…

  • ఈ ప్రాంతంలోని ఆయిల్ పామ్ తోటల గురించి అనుభవం ఉన్న నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.
  • 2016 నుండి ఇప్పటి వరకు ఆయిల్ పామ్ రైతులపై ప్రభావం చూపిన విస్తీర్ణం, సంఖ్యను అంచనా వేయాలి.
  • నర్సరీలలో ఉన్న మొలకల నాణ్యతను అంచనా వేసి, అవి నాటడానికి సరిపోతాయో లేదో సిఫార్సు చేయాలి.
  • 2016 నుండి ఇప్పటి వరకు అన్ని ఆయిల్ ఫెడ్ నర్సరీ కార్యకలాపాలను పరిశోధించి, రైతుల తోటలలో జన్యు లోపం ఉన్న మొక్కల మూల కారణాన్ని కనుగొనాలి.
  • ఆయిల్ పామ్ నర్సరీలలో అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేసి, పూర్తి ఆడిట్ చేయాలి.
  • నర్సరీలలో ఉన్న మొలకల నాణ్యతను ధృవీకరించాలి.
  • నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాధిత రైతుల తోటలకు సంవత్సరానికి ఎకరానికి రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలి.
  • మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తోటలలో ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రభావిత మొక్కలను తొలగించి తిరిగి నాటాలి. నాలుగు సంవత్సరాలపాటు నిర్వహణ ఖర్చును చెల్లించాలి.
  • 2016 నుండి ఇప్పటి వరకు ఆయిల్ పామ్ రైతులకు భారీ నష్టాన్ని కలిగించిన ఆయిల్ ఫెడ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *