- సొంత వైద్యంతో కూతురి ప్రాణం బలి తీసుకున్న నర్స్
- క్యాన్సర్ సోకిందని తెలిసినా ఆధునిక వైద్యానికి తిరస్కరణ
- మొక్కల ఆధారిత ఆహారం… రసాలు… సప్లిమెంట్లతో జెర్సన్ థెరపీ
- అపోహలతో కూతురి ప్రాణాలు బలి… లండన్ లో ఒక తల్లి దురాగతం
సహనం వందే, లండన్:
ఆమె కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒక యువతి. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమెకు కీమోథెరపీ చేస్తే 80 శాతం తగ్గుతుందని డాక్టర్లు నిర్ధారించారు. కానీ తల్లి ఆధునిక వైద్యాన్ని తిరస్కరించి… అశాస్త్రీయ మొక్కల ఆధారిత థెరపి చేయించి కూతురి ప్రాణాలను బలిపొంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ సోదరి… తమ తల్లి ప్రచారం చేసిన వైద్య వ్యతిరేక సిద్ధాంతాల వల్లే కన్నుమూసిందని ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు.
అపోహల ఉచ్చులో కుటుంబం…
కేట్ షెమిరాణి అనే ఒక నర్సు… కోవిడ్-19 గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు తన నర్సింగ్ లైసెన్స్‌ను కోల్పోయింది. ఈమె కుమార్తె పలోమా (23) క్యాన్సర్‌తో బాధపడుతుండేది. కీమోథెరపీతో 80% బతికే అవకాశం ఉందని వైద్యులు స్పష్టంగా చెప్పినప్పటికీ, తన తల్లి ప్రభావంతో చికిత్సను పూర్తిగా నిరాకరించింది. 2024లో చికిత్స లేకుండానే మరణించింది. తప్పుడు సమాచారం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
జెర్సన్ థెరపీ చికిత్సతో దుష్ప్రభావం…
2023 చివరిలో పలోమా ఛాతీ నొప్పి, శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరగా, డిసెంబర్ 22న ఆమెకు నాన్-హాడ్జిన్ లింఫోమా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పలోమా తన తల్లి మాట విని చికిత్సను నిరాకరించింది. పలోమా చివరకు జెర్సన్ థెరపీ అనే ప్రత్యామ్నాయ చికిత్సను ఆశ్రయించింది.

ఇది కఠినమైన మొక్కల ఆధారిత ఆహారం, రసాలు, సప్లిమెంట్లు, కాఫీ ఎనిమాలు వంటి వాటితో కూడుకున్నది. యూకే క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం… ఈ థెరపీ తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. శరీరంపై కొత్త గడ్డలు వస్తే, క్యాన్సర్ శరీరం నుండి బయటకు వెళ్తోందని తల్లి చెప్పేదని స్నేహితురాలు చాంటెల్ తెలిపారు. వైద్య వ్యతిరేక కుట్ర సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో సమాజానికి ఇది ఒక హెచ్చరిక. ఇలాంటి అశాస్త్రీయ ఆలోచనలు ప్రాణాలను బలిగొంటాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.